మాసశివరాత్రి :
ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు. ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. ఉపవాసము ఉండి సదాశివుడిని మనసులో నిలుపుకుని ఆయన నామాన్ని స్మరించాలి. ప్రదోష సమయంలో ఆ సర్వేశ్వరుడికి అభిషేకం జరిపి, బిల్వదళాలతో అర్చించాలి. ఈ విధంగా చేయడం వలన సమస్త పాపాలు నశించడమే కాకుండా దోషాలు తొలగిపోతాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం, సకలశుభాలు చేకూరతాయని పండితులు చెపుతున్నారు.
4 - 0
యోగిని ఏకాదశి
నేడు యోగినీ ఏకాదశి సందర్భంగా...
దైవనామస్మరణతో మనసు మీదా, ఉపవాసంతో శరీరం మీదా అదుపుని సాధించి... భగవంతునికి చేరువకావడమే ఏకాదశి ఉపవాసాల వెనుక ఉన్న పరమార్థం. అందుకే ఏడాది పొడవునా ప్రతి ఏకాదశికీ ఏదో ఒక విశిష్టతను కల్పించారు పెద్దలు. అలా ఈనాటి జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున వచ్చే ఏకాదశి పేరే... యోగినీ ఏకాదశి.
ఈ యోగినీ ఏకాదశి గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి.
ఈ ఏకాదశి ఆచరణ గురించి ఓ చిత్రమైన కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే...
అలకాపురిని ఏలుతున్న కుబేరుడు పరమ శివభక్తుడు. శివార్చన కోసం కావల్సిన పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు, హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు. తనకు అప్పగించిన పనిని హేమమాలి పరమ నిష్టతో ఆచరించేవాడు. మానససరోవరం నుంచి పుష్పాలను తీసుకువచ్చి కుబేరుని చెంత ఉంచేవాడు.
ఒకనాడు భార్య సౌందర్యారాధనలో మునిగిపోయి ఉన్న హేమమాలి కుబేరుని శివారాధన గురించే మర్చిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఉన్న కుబేరుడు తన చెంతకి ఎంతకీ పుష్పాలు రాకపోయేసరికి చిరాకుపడిపోయాడు.
కుబేరుడు మండిపడుతూ ‘నీ శరీరం మీద మోహంతో, మనసు సైతం మలినమైపోయింది. అందుకు ప్రతిఫలంగా కుష్టు వ్యాధిగ్రస్తుడవై భార్యకు దూరంగా భూలోకం మీద జీవించమం’టూ శపించాడు.
కుబేరుని మాటలకు హేమమాలి గుండె పగిలిపోయింది. తొలి తప్పుని మన్నించమంటూ తన స్వామిని ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. ఇక కుబేరుని శాపాన్ని స్వీకరించి కుష్టువ్యాధిగ్రస్తుడై, భూలోకం మీద సంచరించసాగాడు.
హేమమాలి అదృష్టమో, లేక ఇన్నాళ్లుగా అతను శివారాధనలో పాల్గొన్న పుణ్యఫలమోగానీ... అతనికి మార్కండేయ రుషి దర్శనం లభించింది. హేమమాలిని చూసిన మార్కండేయ రుషికి చెప్పలేనంత జాలి కలిగింది. ‘యోగినీ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే నువ్వు శాపవిమోచనాన్ని పొందుతావు’ అంటూ ఉపాయాన్ని సూచించారు మార్కండేయులవారు.
మార్కండేయులు సూచించిన మేరకు జ్యేష్ఠబహుళ ఏకాదశినాడు వచ్చే యోగినీ ఏకాదశి రోజున ఉపవాసమాచరించి, మనసులో దైవాన్ని పదే పదే ప్రార్థించి... హేమమాలి తన శాపవిమోచనాన్ని సాధించాడు. తిరిగి అలకాపురిని చేరుకుని తన భార్యను కలుసుకున్నాడు.
అలా కేవలం హేమమాలి మాత్రమే కాదు... ఎవరైతే యోగినీ ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఆచరించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారో వారు గత పాపకర్మల నుంచి విమోచనం పొందుతారన్నది కృష్ణుని ఉవాచ. హేమమాలి వృత్తాంతం కేవలం ఒక గాథ మాత్రమే కాదు! జీవికి తన శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని విడనాడాలన్న హెచ్చరిక. ఆ మోహాన్ని జయించేందుకు ఏకాదశి ఒక సాధనం అని తెలియచేసే ప్రతీక!
4 - 0
సంకష్టహరచతుర్థి :
పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి, విద్యాప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.
5 - 0
11th June 2025
వటసావిత్రి వ్రతం :
మన సంస్కృతిలో, ఆధ్యాత్మిక జీవన విధానంలో పురుషులతో సమాన ప్రాధాన్యం స్త్రీలకు ఉన్నది. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కుటుంబ క్షేమం కోసం, కట్టుకున్న భర్తకోసం, కన్నబిడ్డల కోసం... పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ధైవారాధనలో నిమగ్నులైవుంటారు. ధర్మార్ధ, కామ, మోక్షాల కొరకు నడిచే బాటలో దారితప్పకుండా... జ్ఞానజ్యోతిని ధరించి చీకట్లను తొలగించుకునేందుకు... మన ఋషివర్యులు ఏర్పరచినవే ఈ పండుగలు, వ్రతాలు, నోములు మొదలైనవి. స్త్రీలు అయిదోతనాన్ని గొప్పవరంగా భావిస్తారు. దానిని కాపాడుకోవడానికి అనేక వ్రతాలు, పూజలు చేస్తారు. మంగళ గౌరీ జ్ఞా వ్రతం, వరలక్ష్మీ వ్రతం, వటసావిత్రి వ్రతం వంటివి ఇందులో విశేషమైనవి. వీటిలో వటసావిత్రి వ్రతానికో ప్రత్యేకత ఉంది. ఈ వ్రతాన్ని వటవృక్షాన్ని పూజచేయడం ద్వారా జరుపుకుంటారు. వటవృక్షం అంటే మర్రిచెట్టు. భారతీయుల జాతి వృక్షం. మర్రిచెట్టును త్రిమూర్తుల సంయుక్త స్వరూపంగా భావిస్తారు. మర్రిచెట్టు వేళ్ళు బ్రహ్మకు, కాండం విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాసస్థలాలు.
వట సావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ అమావాస్య నాడు చేయడం లోకవిధానం. భవిష్యత్తు పురాణం, నిర్ణయ సింధువుల్లో వటసావిత్రీ వ్రతాన్ని జేష్ట మాసం అమావాస్య నాడు ఆచరించాలని ఉంది. అయితే కొందరు జ్యేష్ట పౌర్ణమి నాడు కూడా చేసుకుంటారు. జ్యేష్ఠ పూర్ణిమ నాడే "వట సావిత్రి వ్రతం" ఆచరించాలని కొన్ని ప్రత గ్రంధాలు పేర్కొన్నాయి. తన భర్త సత్యవంతుడు చనిపోయినపుడు, సావిత్రి పవిత్రమైన వటవృక్షాన్ని (మర్రి వృక్షాన్ని) పూజించి, యమధర్మరాజు నుంచి, తన భర్త ప్రాణాలను తిరిగి వెనక్కి తెచ్చుకున్నదని పురాణ కథనం. అందుకే, సావిత్రి పతిభక్తి విజయానికి గుర్తుగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు.
4 - 0
11th June 2025
జ్యేష్ఠ పూర్ణిమ :
జ్యేష్ఠ మాసంలో వచ్చే పూర్ణిమ హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. ఉత్తర భారతదేశంలో ని కొన్ని ప్రాంతాలలో ఈరోజున బ్రహ్మదేవుడుని పూజిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి మర్రి చెట్టుకు ప్రదక్షిణములు చేయడం వలన ఆయురారోగ్యాలు, అపమృత్యు దోషాలు తొలగుతాయి. జ్యేష్ఠ పూర్ణిమ నాడు వటసావిత్రి వ్రతం చేయడం వలన దీర్ఘ సుమంగళీ యోగం సిద్ధిస్తుంది. అంతేకాకుండా నేడు శ్రీ కృష్ణుడుని స్తుతించడం, పూరీ జగన్నాథుణ్ణి సేవించడం శుభదాయకం. జ్యేష్ఠ పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ఎంతో ఉత్తమం. ఈరోజున చేసే వస్త్ర దానాలు విశేష ఫలితాన్నిస్తాయి.
4 - 0
Joined 4 January 2024