Channel Avatar

Gita Makarandam @UCCNbfjfpHOZtYigxBPQ7XzA@youtube.com

35K subscribers - no pronouns :c

🕉️ Namaskaram ,"geyaM giitaa naama sahasraM dhyeyaM shriipa


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Gita Makarandam
Posted 2 hours ago

119 *పరమార్థ కథలు*

పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము,

శ్రీకాళహస్తి.

*మనస్సుయొక్క ప్రతిఘటన*

ఒకానొక పట్టణమునకు అనతిదూరములో ఒక ఆశ్రమము కలదు అందొక మహనీయుడు బహుకాలమునుండి తపస్సు చేసుకొనుచుండెను. అది ఏకాంతప్రదేశము. ధ్యాననిష్ఠకు చాల అనుకూలమైన వాతవరణము అచట కలదు. ఆశ్రమము చుట్టును పూలమొక్కలు, తులసి, మారేడు వనములు కలవు. సుదూర ప్రాంతములనుండి అనేక మంది భక్తులు, ముముక్షువులు, జిజ్ఞాసువులు ఆ ఆశ్రమమునకు అపుడపుడు వచ్చుచు పోవుచు, అనుభవజ్ఞుడగు ఆ గురువరేణ్యుని యొద్ద సద్భోధలను బడయుచు నుండిరి. గురుదేవుడు వారి సంశయముల నెల్ల తృటిలో దూరీకరించివైచుచు, సంతృప్తిపఱచుచు నుండెను. గురుదేవుని అనుభవపూర్వక వాక్యములను, ప్రామాణిక బోధలను శ్రవణము చేయుచు భక్తులు మహదానందమును బడయుచు నుండిరి.

ఇట్లుండ ఒకనాడొక గృహస్థుడు అత్యంత జిజ్ఞాసతో ఆ యాశ్రమమునకు వచ్చి సద్గురు మహాత్మునకు దండప్రణామం బాచరించి యిట్లు మనవి చేసికొనెను- స్వామిా! మహాత్మా! ఈ సంసారము అతి దుర్భరముగా నున్నది. మహాభారతముతో ఆదిపర్వమా యన్నట్లు మోయుటకు చాల ప్రయాసగా నున్నది. శాంతియనునది మచ్చుకైనను కానరాకున్నది. ఒక్క నిముషమైనను నిశ్చలముగ కూర్చొని భగవంతుని ధ్యానించెదమా యనిన ఆ
అవకాశము దొరకకున్నది. నా వలె ఎందఱు ఈసంసార కూపములో పడి నానాదుర్భరయాతనల నొందుచున్నారోయని అపుడపుడు తలంచుకొనుచుందును. దేవా! ఈ సంసారబాధలు తొలగుటకు పరమశాంతిని బడయుటకు ఏదైన ఉపాయమును సెలవిండు. తమ ముఖమునుండి ఏదేని దివ్యమంత్రమును బడసి అద్దానిని సమయము దొరికినపుడెల్ల భక్తిపూర్వకముగ జపించుకొందును, కావున దయచేసి మంత్రోపదేశముచేయ ప్రార్థన.

శిష్యుని తీవ్రజిజ్ఞాసను గమనించి అతనికి మంత్రోపదేశము చేయుటకై గురుదేవుడు నిశ్చయించుకొని అతనిని ఎదురుగ కూర్చండమని చెప్పి, దృష్టిని భ్రూమధ్యమందు స్థాపించమని ఆదేశమొసంగి....
*ఓమ్‌ నమో నారాయణాయ* అను అష్టాక్షరీమంత్రమును చెప్పి శిష్యునిచే మూడుపర్యాయములు పలికించెను. గురువు బోధించిన పవిత్రమంత్రరాజమును శిష్యుడు భక్తిపూర్వకముగ మననము చేసి ప్రతిదినము కనీసము 108 సార్లైనను అద్దానిని జపించుటకు కృతనిశ్చయుడయ్యెను. తదుపరి యతడు గురుమహారాజునకు సాష్టాంగదండప్రణామం బాచరించి వారినుండి సెలవు గైకొని వెడలుచు కొద్దిదూరమేగగా, తోడనే గురువుగా రాతనిని మరల వెనుకకు పిలిపించి ఈ ప్రకారముగ చెప్పిరి. “నాయనా! నీవు జపము చేయునపుడు నీ మనస్సులోనికి కోతిని రానీయవద్దు. దృష్టిని కేవలము శ్రీమన్నారాయణుని చరణకమలముల పైననే ఉంచుము.” అట్లే కావించెదనని పలికి యాతడు సెలవు తీసికొని యింటికి పోయెను.

మరునాడు ప్రాతఃకాలమున యథావిధిగ ఉదయము బ్రహ్మమహూర్తముననే నిద్రలేచి స్నానాదికమును నిర్వర్తించుకొని తన పూజాగృహమున కూర్చొని ఆ గృహస్థశిష్యుడు జపమాల గైకొని గురుప్రోక్తమంత్రమును శ్రద్ధతో జపించ నారంభించెను. దృష్టిని భ్రూమధ్యమందు నిలిపి మనస్సును నారాయణమూర్తియొక్క పదపంకేరుహములందు స్థాపించి జపమును ప్రారంభించగ వెంటనే మనస్సునందు ఒక కోతి స్ఫురించెను. గురువు చెప్పియున్నారు జపకాలమున చిత్తమందు కోతిరాగూడదని. అతనికి కోతి కనుపించిను. దానిని తొలగించగనే వెంటనే చిత్తఫలకమున వేఱొక కోతి కనిపించెను. ఈ ప్రకారముగ కోతిగొడవచేత అతని జపకార్యము ఆవగింజైనను ముందునకు సాగలేదు. దానిచే మనస్సునకు చీకాకు కలిగి తత్‌క్షణమే లేచి గురుదేవుని ఆశ్రమమునకు వడివడిగ పోయి దేశికేంద్రునకు సాష్టాంగనమస్కారము చేసి - మహాత్మా! తాము మంత్రమును ఉపదేశించిన తరువాత నేను ఆనందముతో వెడలిపోవుచుండగా మరల వెనుకకు పిలిచి ఆ కోతిమాట ఎందుకు చెప్పినారు స్వామి?! దానితో నా కార్యక్రమమంతయు తల్లక్రిందులై పోయినది. ధ్యానము, జపము సాగుటలేదు. కోతిని రానీయవద్దని చెప్పినందువలన కోతియే వచ్చుచున్నది. దీని కేదైన నివారణోపాయము తామే సెలవీయవలెను అని
వేడుకొనగా గురుదేవుడు ఈ ప్రకారముగా ఆనతిచ్చెను-
నాయనా! నీవేమియు కంగారుపడవద్దు. మనస్సుయొక్క స్వభావమే అది. దానికి మనమేది చెప్పుదుమో సరిగా దానికి తల్లక్రిందులుగ ఆచరించును. దీనిని ప్రతిక్రియ(Reaction) అందురు. మనస్సు యొక్క ఆ గుణమును కనిపెట్టి సాధకుడు బహుజాగరూకతతో మెలంగి యుక్తితో దానిని స్వాధీనపరచుకొనుచు రావలెను. మనస్సు నందు  కోతి వచ్చినచో ఏ మాత్రము అదరక, బెదరక దానిని తొలగించుటకు ప్రయత్నించు. ఆ కోతిలోకూడ నారాయణమూర్తినే చూడుము. అపు డాకోతి దానంతట నదియే అంతర్ధానమై పోవును, నిన్ను పరీక్షించుట కొఱకే కోతిని గూర్చిన ప్రస్తావన చేసితిని. ఏమియు భయపడవద్దు.  ఏ వస్తువు మనస్సులో స్ఫురించినను నీ దృష్టిని దానిపై నుంచక దానిని లక్ష్యపెట్టక నీ లక్ష్యమగు దైవము పైననే మనస్సు నుంచుటకు ప్రయత్నింపుము. అపుడు ధ్యానము, జపము నిర్విఘ్నముగ, నిరాటంకముగ జరిగిపోవును.

గురుదేవుని అమూల్య సలహాను గ్రహించి శిష్యు డాప్రకారమే ఆచరించి జప ధ్యానాదులను నిరంతరాయముగ కొనసాగించి పరమశాంతిని బొందెను.

*నీతి:- మనస్సునకు తిరుగబడు స్వభావము కలదు. కావున యుక్తితో దానిని దారికి తీసికొని రావలెను*.

14 - 0

Gita Makarandam
Posted 1 day ago

118 *పరమార్థ కథలు*

పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము,

శ్రీకాళహస్తి.

*దైవవిస్మృతి ప్రమాదకరము*

అదియొక పుణ్యక్షేత్రము. సుదూరప్రాంతములనుండి అచటికి వేలకొలది భక్తులు నిరంతరము వచ్చుచు పోవుచునుందురు. ఎప్పుడెప్పుడు దైవదర్శనము దొరకునా, పరమాత్మయొక్క దివ్యమంగళస్వరూపము నెప్పుడు కనులార వీక్షించి పుణ్యము కట్టుకొందుమూ యను తీవ్రతర ఆకాంక్ష పురికొల్ప జనులు తండోపతండములుగ అచ్చోటికి వచ్చుచుందురు. దర్శించిన పిదప “ఆహా! జన్మము ధన్యమయ్యెను గదా" యని పరితృప్తిని పొంది, హృదయమున భక్తిభావమును పెంపొందింప జేసికొని, ఆలయమందు లబ్ధమైన దైవప్రసాదమును పెట్టెలందు పదిలపఱచుకొని ఆనందముతో తమతమ నెలవులకు బోవుచుందురు.

ఆ యూరికొక రైలుస్టేషను కలదు. పుణ్యక్షేత్రము కాబట్టి వచ్చి పోయే యాత్రికుల రద్దీ అచట విశేషముగ నుండును. ఆ స్టేషనులో ఎప్పుడును ఏదియో యొకరైలుబండి వచ్చుచు పోవుచు నుండును. ప్లాట్‌ ఫారం ఎల్లపుడు యాత్రికుల సామానులతోను, యాత్రికులతోను నిబిడీకృతమై యుండును. ప్రయాణీకుల కోలాహలముచే ఆ స్థలమంతయు నిరంతరము ప్రతిధ్వనించుచుండును.

ఇట్లుండ ఒకనాడు అచట ఒక రైలుబండి ప్లాట్‌ఫారంపై కదులుటకు సిద్ధముగ నుండెను. ఇంకొక పదినిముషములలో అది కదిలిపోవును. ప్రయాణీకులు హడావుడిగా లోనికెక్కి కూర్చొనుచుండిరి. పరుగు పరుగున వచ్చి ఎక్కుచుండిరి. దాదాపు అన్ని పెట్టెలు యాత్రికులచే కిటకిటలాడిపోయినవి. ఆ సమయమున ఒక ఖాకీ డ్రెస్సు ధరించిన యువకుడు రైలులో ఎక్కదలంచి వేగముగ నడుచుచు అన్ని పెట్టెలను ఒక్కసారి పరికించెను. కాని కూర్చొనుటకు ఎక్కడను చోటు దొఱకలేదు. అపుడొక ఉపాయ మాతనికి స్ఫురించెను. వెంటనే యతడు చివరి పెట్టెయొద్దకు పోయి అందలి ప్రయాణికులందఱితో ఈ పెట్టె స్టేషనులోనే నిలిచిపోవును. ఇది వెళ్ళదు. దీనిని ఇప్పుడే ఊడదీసివేయుదురు. కాబట్టి త్వరగా దిగి ఇతర పెట్టెలలో సర్దుకొని కూర్చొనుడు. మిా క్షేమము కొఱకు చెప్పుచున్నాను. వినుడు - అని ఏకధాటిగా పలికెను.”

అతడు ఖాకీడ్రెస్సు వేసికొనియున్నాడు కాబట్టి, అతని వాలకము జూచి అతడెవరో పెద్దరైల్వే ఉద్యోగియని భావించి ప్రయాణీకులందఱును అతని మాటలను నమ్మి గబగబ దిగి తక్కినపెట్టెలలో సర్దుకొని కూర్చుండిరి. అపు డాయువకుడు ఆనందపడి తాను వేసిన పాచిక పారినదని భావించి ఆ ఖాళీపెట్టెలో ప్రవేశించి కాలుమిాద కాలు వేసికొని హాయిగా పరుండి నిద్రించెను.

ఇట్లుండ ఆ ప్లాట్‌ఫారంపై అచటనే నిలబడియున్న ఒక పోర్టరు ఈ ఖాకీ డ్రెస్సు వాడెవడో పెద్దరైల్వే ఉద్యోగియని భావించి అతడు చెప్పినట్లు ఆ పెట్టెను ఊడదీయకపోయినచో తన డ్యూటీకి భంగము కలుగునని తలంచి
తత్ క్షణమే ఆపెట్టెను ఊడదీసి బండినుండి వేఱుచేసెను. బండి కదలిపోయెను. ఖాకీడ్రెస్సు యువకుడు నిద్రలేచి చూడగాఆ పెట్టె స్టేషనులోనే పడియుండెను. బండిమాత్రము వెడలి పోయెను. అత్తఱి యతడు ఆశ్చర్యచకితుడై తాను చేసిన తప్పునకు తగిన ప్రాయశ్చిత్తము జరిగెనని భావించి “చెరపకురా చెడేవు” అను సామెత జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడి అచ్చోటు వీడిపోయెను.

ఇచట రైలుబండి యనగా భగవంతుడు. చివరి పెట్టె జీవుడు. జీవుడు భగవంతునితో కలసియున్నపుడు మాత్రమే గమ్యస్థానమగు మోక్షమును చేరగలడు. అనగా నిరంతర దైవస్మృతి, దైవధ్యానము, దైవచింతన గలిగియుండిన మహనీయులు దైవముతో లంకెగలవారై అచిరకాలములో దైవసాన్నిధ్యమును బడయగలరు. అట్లుగాక, దైవవిస్మృతి గలిగి భగవంతుని ఏ కాలమందును చింతన జేయక దేవునితో సంబంధమును విడగొట్టుకొనువారు రైలుబండి నుండి వేరుచేయబడిన పెట్టెవలె ఉన్నచోటనే అనగా సంసారమందే ఉండిపోవుదురు. ఏ మాత్రము కదలరు. ఈ దృశ్యకూపముననే పడి జననమరణప్రవాహమందు కొట్టుకొనిపోవుచు ప్రపంచక్షేత్రమందే ఉండిపోవుదురు. శాంతిని, నిర్విషయఆనందమును పొందజాలక యుందురు.

*నీతి:- దేహధారియగు ప్రతిమానవుడు తనలో వెలుగుచున్న దివ్యమగు ఆత్మతో, దైవముతో లంకెవేసికొని, దైవవిస్మృతిని దూరీకరించి ధ్యానమును లెస్సగ నభ్యసించుచు తీవ్రతరసాధనచే ఈ జీవితమందే దైవసాక్షాత్కారమును బడసి కృతార్థుడు కావలయును. నిరంతరము దైవస్మృతి కలిగియుండుటను అభ్యసించి ధన్యుడు కావలెను. దైవవిస్మృతి మహాప్రమాదకరమని జ్ఞప్తియందుంచుకొనవలెను.*

113 - 0

Gita Makarandam
Posted 2 days ago

Jagadguru Anugraha Vahini....

youtube.com/shorts/XV7iSrq1xC...

0 - 0