Channel Avatar

Ajagava @UC9o3lJsKU3Ip01xcMT63HmQ@youtube.com

156K subscribers - no pronouns :c

“అజగవ” అంటే అక్షరాన్ని పుట్టించినవాడైన ఆ పరమశివుని ధనస్సు పే


Welcoem to posts!!

in the future - u will be able to do some more stuff here,,,!! like pat catgirl- i mean um yeah... for now u can only see others's posts :c

Ajagava
Posted 5 months ago

“ఓరేయ్ డాడీ! నువ్వు మీ అమ్మ పార్టీయా? నా పార్టీయా?” మా నాన్నగారి ప్రశ్న.
“నేను అమ్మ పార్టీనే” క్షణం ఆలస్యం చేయకుండా, అమ్మను వాటేసుకుని మరీ ఖరాఖండీగా చెప్పేసేవాడిని. అప్పుడు మా అమ్మ “నా బంగారం” అంటూ నన్ను ముద్దు పెట్టుకునేది. అప్పటికే మా అక్క, మంచం మీద కూర్చున్న మా నాన్నగారి మెడ చుట్టూ వెనకనుండి చేతులు వేసి ఊగుతూ ఉండేది; తననా ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదన్నట్టు ముఖం పెట్టి. అలా నేను, మా అక్క అమ్మానాన్నలు అనే రెండు పార్టీలకు ప్రాతినిధ్యం వహించేవాళ్ళం. నా సమాధానం వినగానే నవ్వుతూ ఉరిమేవారు మా నాన్నగారు. మా అమ్మ కూడా కిలకిలమని నవ్వేసేది. రాత్రి భోజనాలయ్యాక, యథాప్రకారం నాన్నగారు మంచం మీద పడుకుని కబుర్లు చెబుతుంటేనో, పద్యాలు పాడుతుంటేనో ఆయనకు చెరో పక్కా చేరిపోయేవాళ్ళం అక్కా, నేను. ఆయన పొట్ట మీద చేతులు వేసుకుని అతుక్కుపోయేవాళ్ళం. “ఏరా! ఇందాక అడిగితే నువ్వు మీ అమ్మ పార్టీ అన్నావ్. మళ్ళీ నా దగ్గరకొచ్చేవేంటి” అనేవారు నాన్నగారు నవ్వుతూ. నేను సమాధానం ఏమీ చెప్పకుండా ఇంకాస్త గట్టిగా వాటేసుకునేవాడిని. మా నాన్నగారి కబుర్లు కొనసాగిపోతూ ఉండేవి. అవి వింటూ వింటూ మేం నిద్దట్లోకి జారిపోయేవాళ్ళం.

ఇలా ప్రతీరోజు బోలెడు కబుర్లు. బోలెడన్ని పద్యాలు, చెప్పలేనన్ని సరదాలు.

“ఎవ్వడ వోరి? నీకు ప్రభు వెవ్వడు చెప్పుము? నీ విటొంటిమై
నివ్వనరాశి దాటి యిట కే గతి వచ్చితి? నామ మేమి? నీ
వెవ్వని ప్రాపునం బెఱికితీ వనమంతయు..”

ఇలా రావణాసురుడు హనుమంతుని గద్దిస్తూ ప్రశ్నించే పద్యాన్ని ఆ దానవ చక్రవర్తి ఇలాగే పాడతాడేమో అన్నట్టు గంభీరంగా పాడేవారు మా నాన్నగారు.

“ఖండించెద నీ చేతులు,
తుండించెద నడుము రెండు తునుకలు గాగన్‌
జెండించి నీదు కండలు
వండించెద నూనెలోన వారక నిన్నున్” అంటూ అదే ఉధృతితో ఇంకొక పద్యాన్నీ పాడేవారు. తరువాత “ఇట్లు పట్టరాని కోపంతో నాటోపంబుగా పలుకుచున్న రావణాసురునితో హనుమంతుడు ఏమన్నాడయ్యా అంటే..” అని వచనంగా అంటూ..
“ఇనతనయుని వరమంత్రిని,
జనపతి యైనట్టి రామచంద్రుని దూతన్‌
ఘనుడగు వాయుకుమారుడ
వినుమీ హనుమంతు డనగ వెలసినవాడన్”
అని హనుమంతుడు పాడినట్టే హాయిగా, స్థిరంగా, రాగం తీస్తూ పాడేవారు. ఈ పద్యాలన్నీ మొల్ల రామాయణంలో పద్యాలని నాకు ఆ తరువాత కాలంలో ఎప్పుడో తెలిసింది.

ఇక ఆయన పోతనగారి గజేంద్రమోక్షం పద్యాలు పాడుతుంటే ఆనందం పట్టలేకపోయేవాడిని. నాది ఆ పద్యాల అర్థం గురించి, పోతనగారు చెప్పదలచుకున్న భగవంతుని తత్త్వం గురించి ఇలా ఏమీ తెలియని, తెలుసుకోలేని వయసే అయినా, వాటి నడకలో ఉండే అందమైన సొగసు, మా నాన్నగారి మధురమైన కంఠంలో ప్రవేశించి అక్కడనుండి నా చెవుల ద్వారా మనసు లోపలికి వెళ్ళిపోయి, కాలక్రమంలో ఆ పద్యాలన్నీ కంఠతా వచ్చేశాయి.

“సీతాపతే రామ రాధాపతే కృష్ణ శ్రీరుక్మిణీ సత్యభామాపతే
వాణీపతే బ్రహ్మ గౌరీపతే శంభొ లక్ష్మీపతే శ్రీమన్నారాయణా!”
అనే పద్యాన్ని రోజూ రాత్రి ప్రార్థనా శ్లోకంగా చదువుకునేవాళ్ళం.
అప్పుడప్పుడూ మా అమ్మ కబుర్ల మధ్యలో సరదా పొడుపు కథలు అడుగుతుండేది.
“మా నాన్నగారు ఎవరికి మామగారో, వాళ్ళ కోడలి నాన్నగారు మా కొడుక్కి మామగారు” ఇదేంటో చెప్పుకోండి చూద్దాం అనేది.

“అత్తగారి అత్తగారు మామగారి తల్లికి ఏమవుతుంది?” అంటూ వెంటనే మరో పొడుపుకథ పొడిచేది. నేనూ మా అక్కా తెగ లెక్కలు వేసేసేవాళ్ళం. సమాధానం చెప్పగలిగిన వాళ్ళకు మా అమ్మ పెట్టే ముద్దే పెద్ద బహుమానం. మీరు చెప్పలేకపోయారంటూ మా అమ్మ మా నాన్నగారిని ఎత్తిపొడిచేది. మేం మా నాన్నగారి వంక విజయగర్వంతో చూసి, మళ్ళీ ఆయన పొట్ట మీద చేతులు వేసుకుని పడుకునేవాళ్ళం.

ఇక్కడ నా పేరు వెనుకనున్న చిన్నపాటి కథను కూడా చెప్పుకోవాలి. నేను పుట్టే సమయానికి మా నాన్నగారు భీమవరంలో లేరు. ఏదో పని మీద మద్రాసు వెళ్ళారు. బహుశా అందుకేనేమో నా పేరుకి కాస్తంత అరవ సువాసన అబ్బి, పదహారణాల తెలుగుతనంలో ఒక అణా తగ్గింది. అయినా అది అరవ రవం కాదు, సంస్కృత సంబోధనే అనుకుంటూ ఆనందిస్తుంటాను నేను.

జాతకం ప్రకారం నా పేరు 'త'కారంతో మొదలవ్వాలని జ్యోతిష్కుడు చెప్పాడట. మా నాన్నగారికేమో నాకు వాళ్ళ నాన్నగారి పేరైన “కామరాజు” అని పెట్టాలని కోరికట. ఈలోగా మా అమ్మేమో “మనవాడి పేరులో శ్రీకృష్ణుని పేరు కలిసేలా చూడండి. వాడు పుట్టే ముందురోజు నాకు కృష్ణపరమాత్మ కలలోకి వచ్చాడు” అందట. ఈ 'త'కారంతో, మా తాతగారి పేరైన కామరాజుని, మా అమ్మగారి కోరికైన శ్రీకృష్ణుడి పేరునీ జత చేయడానికి మా నాన్నగారు బోలెడంత నామ యోగసాధన చేయాల్సి వచ్చింది. అలా “త్రిసత్యకామరాజన్” అనే ఇంతముందు ఈ భూమ్మీద లేని పేరొకటి ఉద్భవించింది.
తీరా నా పేరు చూసి.. ఇందులో కృష్ణుడెక్కడున్నాడంటూ మా అమ్మగారు యుద్ధానికి సిద్ధమవుతుంటే.. “కృష్ణుడన్నా సత్యనారాయణస్వామన్నా విష్ణుమూర్తి అవతారాల బాపతే కదే పిచ్చిదానా!. అందుకే ఆ పేరునే కుదించి “సత్య” అని మనవాడి పేరులో కలుపుతున్నాం.” అని కాస్తంత అద్వైతం చెప్పి యుద్దాన్ని నివారించారట. “మరి ఆ రాజన్ ఏమిటి మరీ తమిళ పేరులాగా?” అని అడిగిందట మా అమ్మ. అందుకు మా నాన్నగారు “త్రిసత్యకామరాజు అంటే ఏదో ఎబ్బెట్టుగా తోస్తోంది.. అందుకే “త్రిసత్యకామరాజన్” అని కాస్తంత కొత్తదనం కలిపానులే” అన్నారట. దానితో మా అమ్మ పూర్తిస్థాయిలో శాంతించిందట. మా నాన్నగారికి నా పేరుని పి.టి.ఎస్.కె. రాజన్ అనో రాజన్ పి.టి.ఎస్.కె. అనో వ్రాయడం ఇష్టం. ఆయన మొబైల్‌లో కూడా నా పేరు అలానే ఉండేది. అలా ఆయనిష్టమే నా ఇష్టంగా మారిపోయి రాజన్ పి.టి.ఎస్.కె అన్న పేరుని స్థిరపరచుకున్నాను.

చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి ఇలా పిల్లల కథల పుస్తకాలన్నీ, ప్రతీనెలా క్రమం తప్పకుండా తీసుకొచ్చేవారు మా నాన్నగారు. ఆ పుస్తకాలు వచ్చినరోజు పండగలా ఉండేది నాకు. ఇక మా భీమవరం మావుళ్ళమ్మ ఉత్సవాల సమయంలో అయితే మా ఆనందం పట్టలేనంతగా ఉండేది. మేం నలుగురం సరదాగా నడుచుకుంటూ, చిన్నవంతెన మీదుగా అమ్మవారి గుడికి వెళ్ళేవాళ్ళం. ఆ ఉత్సవంలో పెట్టిన లైటింగులు చూస్తూ.. నేను, మా అక్క నోళ్ళు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆ తరువాత ఇది బావుంటుంది. అది బావుంటుంది అంటూ మిరపకాయబజ్జీలు, జిలేజీలు, బజ్జీమిక్చర్లు ఇలా అన్నీ నాన్నగారు కొనిపెట్టడం, అక్కా, నేనూ తింటూ గెంతులెయ్యడం. ఇలా గంటన్నరో రెండు గంటలో గడచిపోయేది. “ఇంటికి వెళ్ళాక అన్నాలు తినాలి కదా! ఇక చాలు పదండి” అని అమ్మ హుకుం జారీచేసేది. మేం నాన్నగారి వైపు దీనమైన ముఖాలతో చూసేవాళ్ళం. “ఏం పర్లేదు మీరు కానివ్వండి” అన్నట్టు ఆయన తల ఊపేవారు. మళ్ళీ కథ మొదటికొచ్చేది.

చిన్నప్పుడు మా అల్లరికి నాన్నగారి చేతిలో దెబ్బలు తిన్నరోజులు కూడా చాలానే ఉన్నాయి. కాకపోతే.. దెబ్బలు తిన్నరోజు కూడా మాకు పండగ రోజే. కోపంతో రెండు దెబ్బలు వేసినా, ఆ తరువాత ఆయన విలవిల్లాడిపోయేవారు. ఆరోజు సాయంత్రం సినిమాకి తీసుకువెళ్ళడమో, ఐస్ క్రీమ్స్ తీసుకురావడమో చేసేవారు. ఇక సినిమాకి వెళ్ళిన ప్రతీసారి ఇంటర్వెల్‌లో నాకూ, మా అక్కకు గోల్డ్ స్పాట్ తప్పనిసరి. మా అమ్మకు అయితే లిమ్కా. నాకు మా అమ్మ లిమ్కాలో కూడా వాటా ఉండేది. వీటితో పాటు సమోసాలు, తినే గొట్టాలు కొనేవారు.

నేను ఇంటర్లో ఉండగా, అమ్మ, నాన్న, అక్క, నేను, మా నాయనమ్మ కలసి కారులో బెజవాడ కనకదుర్గ గుడి, త్రిపురాంతకం, శ్రీశైలం, మహానంది, బ్రహ్మంగారి మఠం, పెద్దతిరుపతి ఇలా పదిరోజుల యాత్ర చేశాం. ఆ యాత్రలో చిలుకలూరి పేటలో తిన్న సాంబార్ ఇడ్లీ, నంధ్యాలలో తిన్న భోజనం, తిరుమల ఉడ్ ల్యాండ్‌లో తిన్న చపాతీల రుచి ఎంతగా గుర్తున్నాయో, ప్రయాణం సాగుతున్నంతసేపూ మా నాన్నగారు చెప్పిన విశేషాల రుచి వాటన్నింటికంటే ఎక్కువగా గుర్తుంది. ఇలా ఆ యాత్రాకాలం అంతా బోలెడన్ని అనుభూతులు, చెప్పలేనన్ని సరదాలతో సాగిపోయింది. అనుభూతులంటే ఒక విషయం గుర్తుకువస్తోంది.

ఇప్పటికీ ఆరోజు నాకు బాగా గుర్తు. ఆరాత్రి పెద్ద వర్షం. కుండపోతగా కురిసేస్తోంది. కరెంటు లేదు. అప్పటికే భోజనాలు అయ్యి చాలా సేపయ్యింది. అందరం మంచం మీదకు చేరిపోయాం. ఉరుములు, మెరుపులు. ఆ వర్షం పడుతున్న శబ్దం మా పెంకుటింటి మట్టి గోడల్లోంచి భీకరంగా వినబడుతోంది. అమ్మానాన్నల మధ్యలో పడుకున్న నాకూ, మా అక్కకూ చెప్పలేనంత సంబరంగా ఉంది. అంతోటి వరుణదేవుడు కూడా అమ్మానాన్నల మధ్యలో పడుకున్న మమ్మల్ని భయపెట్టలేకపోతున్నాడు. అంత చలిలోనూ మాకు వెచ్చగానే ఉంది. నాన్నగారు “తోకపీకుడు కథ” అనే సరదా కథొకటి చెబుతున్నారు. ఇంతలో మా అమ్మ “మీరు చెబుతూ ఉండండి” అని నాన్నగారితో అని, ఆ చిన్న కిరసనాయిలు దీపం పట్టుకుని వంటింట్లోకి వెళ్ళింది. దీపం అమ్మతోపాటూ వంటింట్లోకి వెళ్ళిపోవడం వల్ల మేమున్న గదంతా కారు చీకటి అయిపోయింది. ఇంతలో మా నాన్నగారు సిగరెట్టు వెలిగించారు. ఆ చిమ్మ చీకటిలో సిగరెట్టు చివర ఉన్న ఎర్రటి వెలుగు ఒక్కటే కనబడుతోంది. భలేగా ఉందనిపించింది. అప్పటికి నాకు ఆరేడేళ్ళకు మించి ఉండుండకపోవచ్చు. కానీ ఇప్పటికీ ఆ వెలుగు నాకు స్పష్టంగా కనబడుతున్నట్టే ఉంటుంది. ఇంతలో అమ్మ వంటింటిలోనుండి వేయించిన వేరుశెనగ గుళ్లు ప్లేటులో వేసి తీసుకు వచ్చింది. ఆ వర్షంలో, ఆ చిమ్మచీకటిలో, వేయించిన వేరుశెనగ గుళ్ళు తింటూ నాన్నగారు చెప్పే కథ వినడం, అప్పుడు పొందిన ఆ ఆనందానుభూతి... మూడు దశాబ్దాలు గడచినా, ఇప్పటికీ తలచుకున్నప్పుడల్లా నా శరీరం పులకిస్తూనే ఉంటుంది.

మా నాన్నగారు కీ.శే. పెట్ల వీరభద్రరావుగారు శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం, చల్లవాని పేట దగ్గరలో ఉన్న జోనంకి అనే గ్రామంలో పుట్టారు. పెట్ల కామరాజు గారు, మాణిక్యమ్మల ఆరవ సంతానం. ఆయనకు ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు. తన పదిహేనవ యేట మాకు నిత్య స్మరణీయులైన శ్రీ ఇందుకూరి రామరాజు గారు చూపించిన అభిమానం కారణంగా.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం దగ్గరలోని గరగపర్రు వచ్చారు. వారి కుటుంబంలో ఒకరిగా పెరిగారు. రామరాజుగారి కుమారుడైన మా బాబుల్ అన్నయ్య, రామరాజుగారి తమ్ముడైన మా బుల్లినాన్న మా నాన్నగారికి ప్రాణస్నేహితులు. వీళ్ళిద్దరి పేర్లూ కూడా ఇందుకూరి త్రినాథరాజే. ఆ తరువాత భీమవరంలోనే పుట్టి పెరిగిన మా అమ్మ లక్ష్మీరాజేశ్వరిని పెళ్ళాడి దేవి, రాజా అనే మా అక్కను, నన్ను ఈలోకానికి తీసుకొచ్చారు. మమ్మల్ని లాలించారు, ఆలించారు, ప్రేమించారు. ఏ లోటూ లేకుండా పెంచారు. పదిమందిలోనూ చాలా మంచి పేరు సంపాదించారు. భీమవరంలో అందరూ ఆయనను గురువు గారని పిలిచేవారు. ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండే మా నాన్నగారు, ఆ అలవాటుతోనే, సరిగ్గా పదమూడేళ్ల క్రితం మా అక్క కొడుకుని ఆడిస్తూ, నవ్విస్తూ, నవ్వుతూ వెళ్ళిపోయారు. కాశీకి వెళ్ళిరావాలనే ఆయన కోరికతీరకుండానే ఆయన తన అరవయ్యో యేట సరాసరి కైలాస యాత్రకు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఆయనను గుర్తుచేసుకున్నప్పుడల్లా.. “గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్” అన్న నన్నయ్యగారి మాటే గుర్తుకు వస్తుంటుంది. నాన్నగారి జ్ఞాపకాలకు అంతులేదు. ఆయన రూపానికి నా మనసులో ఎప్పుడూ మరపురాదు. “ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న” అన్న సినారె గీతాన్ని పదే పదే స్మరించుకుంటూ, మా నాన్నగారికి నమస్కరించుకుంటూ

స్వస్తి!
- రాజన్ పి.టి.ఎస్.కె

774 - 86

Ajagava
Posted 5 months ago

“కళ్ళుంటే కలకత్తా చూడాలి. లేదంటే బరంపురం చూడాలి!” - ఇది మా నాయనమ్మ నోట్లో నానుతుండే మాట. తొంభైయేళ్ళ పాటు సులోచనాలు అవసరం పడని చక్కని కళ్ళున్నా.. ఆవిడెప్పుడూ కలకత్తా చూడలేదు. తన చిన్ననాటి జ్ఞాపకాలున్న బరంపురానికి, పెరిగి పెద్దయిన తరువాత మళ్ళీ ఎప్పుడూ వెళ్ళలేదు. నాన్నమ్మ కళ్ళే కాదు, పళ్ళు కూడా గట్టివే. జీవిత చరమాంకం వరకూ, ఆవిడ నవ్వినప్పుడల్లా... 32 పళ్ళూ మెరుస్తూనే ఉండేవి.


తను పుట్టిన సంవత్సరం నాన్నమ్మకు గుర్తులేదు. “నీ వయసెంత నాన్నమ్మా?” అని అడిగితే... నాదీ, మా ముత్తింజంది ఒకటే వయసనేది. ఆ ముత్తింజం అన్నాయన మా నాయనమ్మకు మేనత్త కొడుకు. అసలు పేరు మృత్యుంజయం. పలకడానికి కొంచెం కష్టంగా ఉన్న ఆ పేరు, కుటుంబ సభ్యుల నోళ్ళలో నిటారుగా నిలబడలేకపోయింది. ముందు ఎగ్గొట్టబడి తరువాత దిగ్గొట్టబడింది. ప్రకృతి కాస్తా వికృతైపోయింది. నాలుగక్షరాల పేరు కుదించుకుని మూడక్షరాలలోకి వెళ్ళిపోయింది. చివరికి ఆ మృత్యుంజయం అన్నపేరు ముత్తింజంగా మారిపోయింది. ఇంతకీ ఆ ముత్తింజం గారి వయసు కూడా మనకు తెలియదు.


మా పెద్ద మేనత్త పుట్టిన సంవత్సరమే “కనకతార” సినిమా వచ్చిందని, తానా సినిమాకు వెళ్లానని నాన్నమ్మ చెబుతుండేది. లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లు ఇచ్చిన సమాచారం ప్రకారం మా పెద్ద మేనత్త పుట్టింది 1937లో అయ్యుండాలి. మా మిగతా మేనత్తలు, పెదనాన్నల వయసులని బట్టి లెక్కేస్తే, ఆ లెక్కకు ఆ సంవత్సరం సరిపోతుంది. ఈ లెక్కల ప్రకారం మా నాయనమ్మ వయసుని అంచనా వేస్తే, ఆవిడ పుట్టిన సంవత్సరం 1920 కి కొంచెం అటో ఇటో అయ్యుండాలి. ఇప్పుడు నాయనమ్మ ఉండుంటే, బహుశా ఆవిడకు 104 వ యేడు నడుస్తుండేది.


నాయనమ్మకు నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. మా నాన్నగారు మూడో కొడుకు. అప్పట్లో మేం భీమవరంలో ఉండేవాళ్ళం. నాయనమ్మ తన కొడుకులందరి దగ్గరా కొన్ని కొన్ని నెలల పాటు ఉంటూ ఉండేది. భీమవరం వచ్చి రెండు మూడు నెలలు అవ్వగానే, నాన్నగారితో... “వెంకట్రావుని చూడాలని ఉందిరా అనో, గోవిందు గుర్తొస్తున్నాడనో, రమణమూర్తి ఎలా ఉన్నాడో!” అనో అంటుండేది. అంటే శ్రీకాకుళం వైపో, వైజాగు వైపో, తన మనసు తిరిగిందని, ప్రయాణానికి సిద్ధం చెయ్యమని చెప్పడమన్నమాట. వెంకట్రావంటే మా చిన్న పెదనాన్న గారు, గోవిందరావు అంటే మా చిన్నాన్న గారు, రమణమూర్తి అంటే మా పెద్ద పెదనాన్న గారైన రామారావు గారి పెద్దబ్బాయి. అలా శ్రీకాకుళం అక్కడకు వెళ్లి కొన్ని నెలల పాటూ ఉన్నాక, మళ్ళీ భీమవరం వైపు మనసు మళ్ళేది మా నాయనమ్మకు. అయితే.. కొడుకుల దగ్గర ఎంత సౌకర్యంగా ఉన్నా, కోడళ్ళు ఎంతో అభిమానంతో చూసుకుంటున్నా ఆవిడ మనసు మాత్రం ఎప్పుడూ ఒక పల్లెటూరు వైపుకి పరుగుతీసేది. ఆ ఊరు పేరు “జోనంకి”. శ్రీకాకుళం జిల్లాలో, జలుమూరు మండలంలో, చల్లవాని పేట ప్రక్కనే ఉండే చిన్నపాటి గ్రామమది. మా తాతగారైన పెట్ల కామరాజు గారిని పెళ్లాడి, మా నాయనమ్మ కాపురానికి వచ్చిన ఊరు. “ఓ...మాణిక్యమ్మోయ్”, “ఓ...మాణిక్యం అక్కయ్యోయ్” అన్న మాటలు 60 యేళ్ళ పాటు ఆవిడ చెవులలో రోజూ ప్రతిధ్వనించేలా చేసిన ఊరు. అన్నిటికన్నా ముఖ్యంగా మా నాయనమ్మకు కథలు, పాటలు నేర్పించిన ఊరు. అక్కడ నుండే మా నాయనమ్మ కొడుకుల దగ్గరకు, కూతుళ్ళ దగ్గరకు వెళుతుండేది.


భీమవరం ఎప్పుడు వచ్చినా, అక్కడ ఉన్నంత కాలం రోజూ రాత్రి పడుకునేటప్పుడు కోరికోరి కథలు చెప్పించుకునేవాళ్ళం. పాటలు పాడించుకునేవాళ్ళం. మాకు అన్నం తినిపించేటప్పుడు ఈ కథలు, పాటలనే తను తాయిలాలుగా వాడేది.


“చిన్నికృష్ణ చిన్నికృష్ణ వెన్నల దొంగ
మా గోవులన్ని తోలుకుని వేగము రారా
భలే బాగుగ రారా
అమ్మ నాకు బంగారు బండినియ్యవే
గుఱ్ఱంబునెక్కెదన్ ఏనుగంబు నెక్కెదన్
కిర్ కర్ కిర్ కర్”


ఈ ముద్దులొలికే గీతం యశోదా, బాలకృష్ణుల సంవాదంలోనిది. చివరిలో చిన్నికృష్ణుడు ముద్దుగా నడుచుకుంటూ వస్తుంటే అతని చెప్పుల శబ్దాన్ని అలా కిర్ కర్ కిర్ కర్ అంటూ నాయనమ్మ శ్రావ్యంగా పాడుతుంటే బలే గమ్మత్తుగా ఉండేది.


ఈ పాటనే కాదు, సందర్భానికి తగ్గట్టుగా ఎన్నో హుషారైన పాటలు పాడేస్తుండేది మా నాయనమ్మ. మా పెద్దపెదనాన్నగారమ్మాయి శాంతక్క పెళ్ళిలో... “బావగారికి మర్యాద చెయ్యండిరా!” అని మాతో అంటూ, ఎలా చెయ్యాలో కూడా చెప్పింది.


“బావగారు రండి మీకు బడాయేల నండి
కోటు జేబులోన గడియారమున్నదండి
తన్నుకుంటెగాని మీకు టయము తెలియదండీ...” ఇలా అన్న మాట. ఇంకా ఆ పాట చాలా పొడవుందటుంది గాని, నాది మా నాయనమ్మ స్థాయి జ్ఞాపకశక్తి కాకపోవడంతో, ఆ పాటలోని చరణాలన్నీ జారిపోయి, కేవలం ఈ పల్లవి ఒక్కటే నా మస్తిష్కంలో మిగిలిపోయింది.


కుచేలుడు అనేక సంవత్సరాల తరువాత కృష్ణ దర్శనం చేసినప్పుడు కృష్ణుడు పాడే... “కుచేలా నిన్ను చూచి చాలా దినములాయె...” అనే పాట హృదయానికి హత్తుకునేలా పాడేది. కృష్ణుడు, కుచేలుడు సాందీపుని వద్ద చదువుకోవడం, వాళ్ళు అడవిలోకి కట్టెలకని వెళ్ళి తప్పిపోవడం, ఆపై పెద్ద వర్షంలో చిక్కుకుపోవడం... ఇలా ఆ ఘట్టాలన్నీ మధురమైన జానపదశైలిలో విన్నవారి మనసులకు హాయి కలిగించేలా పాడేది.


అలాగే, రైలు బండి మీద...
“మైము అంటె రైము జేసె
మాయదారి రైలు బండి
మైలు టపా జనము తోటి
మదరాసు నుండి
భుగభుగమని భూమితోడ
ఎక్కీ దిగే జాతులెల్ల
వేగిరముగ వెడలిపోయే
వాల్తేరు పొగబండి..” అనే పాట పాడేది. అంత్య ప్రాసలతో గూడ్సు రైలంత పొడవుండే ఆ అందమైన పాటలో, ఇప్పుడు ఈ ఒక్క భోగీనే మిగిలింది.


ఇంకొకపాట మధ్యలో...
“అంగమాను కొండ మీద కొంగ ఉన్నది
కొంగ కడుపులోన శివ లింగమున్నది.” అని వస్తుంది. ఆ పాట మొదలు మాత్రం ఎంత ప్రయత్నించినా తట్టడం లేదు. పెద్దలెవరికైనా ఈ పాట తెలుసుంటే చెప్పవలసిందిగా మనవి. ఆ పాట మొత్తం దొరికితే మా నాయనమ్మే తిరిగొచ్చి పాడినంత సంతోషం కలుగుతుంది.


ఇక నాన్నమ్మ దగ్గర మా నాన్నగారు నేర్చుకుని పాడిన పాటలు మాత్రం బాగానే గుర్తున్నాయి.
“చిట్టెమ్మెక్కిన రైలు బండి చీపురుపల్లి స్టేషను కాడ
శీల జారిపోయిందే రయ్యో కొయ్యోడా
ఆ ముండగొల్లిగాడు నా చెయ్యి పట్టుకుంటే
నా ఒళ్ళు ఝల్లు మన్నదో రయ్యో కొయ్యోడా” అనే పల్లెపాట ఎన్నిసార్లు విన్నా సరదాగానే ఉండేది.


అలాంటిదే ఇంకొక జానపద గీతం...
“కాలు మీద కాలు పెట్టి తొక్కి తొక్కి తన్నుతుంటే
కంసాల్ సూరన్న నాకు కాల జగడమన్నదే కోడీ పిల్ల
అంచూన చితక పెట్టి ఇంచూగ తింటు ఉంటే
చీకటి జలాంతరమంత చూసి వస్తనన్నదే కోడి పిల్ల
పొద్దున్న లేవగానే దేహ శుద్ధి చేస్తుంటే
గద్దతో యుద్దాని కెళతానన్నదే కోడీపిల్ల”


ఇలా ఎన్నో ఎన్నెన్నో పాటలు. రాత్రి భోజనాలయ్యాక అందరం సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, ఒక్కోసారి మా నాన్నగారు జానపదగీతాలు పాడుతుండేవారు. ఆయన పాడుతున్నదాంట్లో చిన్నపాటి తప్పుదొర్లినా, కొంచెం బాణీ తప్పినా “అస్సే...అలా కాదు!” అంటూ, ఒక చేత్తో నాన్నగారిని వారించి తను అందుకునేది.
పడుకునే ముందు అక్క నేను నాయనమ్మ ప్రక్కకు చేరిపోయేవాళ్ళం. నక్క పెంచిన రాజకుమారి కథ, మాయా విసనకర్ర కథ, బాలనాగమ్మ కథ ఇలా బోలెడన్ని కథలు నిద్ర తేలగొట్టుకుంటూ మరీ వినేస్తుండేవాళ్ళం. అలా చెవులు చేటలు చేసుకుని మరీ వినే బృందంలో.. నేను, మా అక్కతో పాటు మా అమ్మ, నాన్న కూడా ఉండేవారు.
బాలనాగమ్మ కథలో... తన నెలల వయసున్న కొడుకు బాలవర్ధిరాజు ఎడుస్తుంటే, అతణ్ణి లాలించడానికి ఉయ్యాల వద్దకు వెళుతుంటుంది బాలనాగమ్మ. ఈలోగా మాయల ఫకీరు వచ్చి ఓమ్ భీమ్ బుష్ అని ఓ మంత్రం చదివేసి, ఆమెను కుక్కగా మార్చేసి తీసుకు వెళ్ళిపోతాడు. అక్కడ వరకూ మా నాన్న కథ చెప్పగానే నాకు మా అక్కకు ఏడుపొచ్చేసేది. పాపం బాలనాగమ్మ అనుకుంటూ కన్నీళ్ళు కార్చేసేవాళ్ళం. ఇక అక్కడనుండి కథ పూర్తయ్యే వరకూ కళ్ళు పెద్దవి చేసుకుని, మధ్య మధ్యలో “ఆ.. ఆ తరువాత ఏమయ్యింది” అని ఆరాటంతో అడుగుతూ, నాయనమ్మ ముఖం వంకే చూస్తూ కథ వినేవాళ్ళం.


కేవలం కథల్ని ఆసక్తికరంగా చెప్పడమే కాదు, తన చిన్నప్పటి సంగతుల్ని కూడా అందమైన కథల్లానే చెప్పేది మా నాయనమ్మ. మా నాన్నమ్మంటే వాళ్ళ నాన్నగారికి చాలా గారాబం. కూతురు స్కూల్‌కి వెళ్ళడానికని ఒక గొర్రెపోతు బండిని స్వయంగా తయారు చేశారట. ఆయన బెండపూడి సాధువు గారి శిష్యులు. ఇక వాళ్ళింట్లో పెరిగే దుప్పి, పిల్లి, కుక్క, చిలుక నాయనమ్మకు చిన్నప్పటి నేస్తాలు. వాటిలో చిలుక, పిల్లి చాలా స్నేహంగా ఉండేవట. ఒకరోజు ఆ రెండూ ఎప్పటిలానే ఆడుకుంటూ హుషారుగా ఉన్నాయట. ఆ పిల్లి ఆటకన్నట్లుగా చిలుక మెడను మెల్లిగా పట్టుకుందట. కానీ పొరపాటున ఆ పిల్లి పన్నొకటి చిలుక మెడలో గుచ్చుకుపోయి, ఆ చిలుక చనిపోయిందట. చిలుక చనిపోయిందన్న బెంగతో ఆ పిల్లి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం మానేసి, కొన్ని రోజులకే చనిపోయిందట. ఈ విషాధ గాథ వినగానే దుఃఖం పొంగుకొచ్చేది.


మా నాయనమ్మ చాలా సరదా మనిషి కూడా. చమత్కారంగా మాట్లాడుతూ మమ్మల్ని నవ్విస్తుండేది. ఒకసారి మా చిన్న మేనత్త కొడుకు శంకరం బావకు ఎలుగుబంటి కలలోకి వచ్చింది. అతనా విషయం మా నాయనమ్మకు చెప్పి “అమ్మమ్మా! ఎలుగుబంటి కలలోకి రావడం మంచిదేనంటావా” అని అడిగాడు. మా నాయనమ్మకు మా శంకరం బావను ఆట పట్టిచడమంటే సరదా. దానితో “చాలా అశుభంరా శంకరం. ఎలుగంటే నల్లనిది, ఒళ్లంతా వెంట్రుకలుంటాయ్, రక్తం తాగుతుంది కూడా.. అటువంటి జంతువు కలలోకి వస్తే ఇబ్బందే అంది.” మా బావ కంగారుపడిపోయాడు. మా నాన్నమ్మ బెదరగొడుతోందని మా నాన్నగారికి తెలుసును కనుక, నవ్వుకున్నారు. ఆపై మా పెదనాన్నగారి అబ్బాయి రమణమూర్తిని పిలిచి, “ఒరేయ్ రేపు శంకరం ఉండగా నువ్వు కూడా నాన్నమ్మతో నీకు కూడా ఎలుగుబంటి కలలోకి వచ్చిందని చెప్పు, ఏమంటుందో చూద్దాం” అన్నారు. సరేనన్న మా అన్నయ్య, మర్నాడు మా నాయనమ్మతో ఆ మాటే అడిగాడు. “నాన్నమ్మా! నాకు కలలోకి ఎలుగుబంటి వచ్చింది, మంచిదేనంటవా?” అని. వెంటనే మా నాయనమ్మ “జాంబవంతుడురా నాన్నా! ఎంతో శుభం. నల్లని జంతువు కదా ఇంకా మంచిది. కృష్ణుడు నలుపు, రాముడు నలుపు” అంది. మరి రక్తం తాగే జంతువు కదా, పర్లేదా అన్నాడు మా అన్నయ్య చిన్నగా నవ్వుతూ. “అడవిలో జంతువులు రక్తం కాక, పాలు తాగుతాయా..” అని నవ్వేసింది ఓరగా మా శంకరం బావను చూస్తే. మా బావ కోపంతో రెండు తాటిచెట్ల ఎత్తులో లేచాడు. మేమంతా పకపకా నవ్వులు. ఇలా ఎన్నో సరదాలు నాయనమ్మతో.


ఇంకా తను గాంధీగారిని చూసినప్పటి సంగతులు, తను చూసిన నాటకాల సంగతులు, అలనాటి సినిమా సంగతులు, తన పిల్లల చిన్నప్పటి సంగతులు.. ఇలా ఎన్నో విషయాలు కథలు కథలుగా చెబుతుండేది నాన్నమ్మ. నిజానికి అవన్నీ వ్రాసుకుంటూ వస్తే, ఒక మినీ నవలంత పుస్తకం సిద్ధమవుతుంది.


అప్పట్లో మా నాయనమ్మ భారతానికి సంబంధించిన పొడుపు కథొకటి అడుగుతుండేది. భారత రామాయణాలు జానపదుల నోళ్ళలో పడి చాలామార్పులకు గురవుతుంటాయి కనుక, వాటిని మూల కావ్యాలతో పోల్చి చూడకూడదు. అటువంటి దృష్టితోనే ఈ పొడుపు కథను కూడా విప్పాలి. ఇంతకీ ఆ పొడుపు కథ ఏంటంటే..
“మహారాజశ్రీ పెదనాన్నగార్లైన పెండ్లి కానిదాని కుమారుని సముఖమునకు,
నీ తమ్ముడు భార్య అన్న మేనత్తకు పెండ్లి అయిన తరువాత పుట్టిన పుత్రులలో పెద్దవాని తరువాత వాని పుత్రుడగు నేను వ్రాసుకున్న ఉత్తరము ఏమనగా, వేయికన్నులు గలవాని మనుమనికి ఇస్తామన్న పిల్లను నీ చెలికాడు, గర్భము కొట్టిన దాని కుమారు కుమారునకు అడుగుచున్నారట. తురంగమునకు పుట్టినవాని తండ్రియున్నూ, ఈశ్వరుని వాంఛించిన దాని అన్నయున్ను, నీవును వెళ్ళి అడుగుట ధర్మమా? మత్స్యములతో జీవనము చేసి జాలర్ల ఇంట తిరిగిన నీకు ఈ బుద్ధి పుట్టినా పుట్టుండవచ్చును పెదనాన్న!
ఇట్లు
నేనే.”


ఎవరు ఎవరికి వ్రాశారీ ఉత్తరాన్ని అన్నదే ఈ పొడుపు కథ? విప్పడానికి ప్రయత్నించండి!!


ఇవీ తన 90వ యేట స్వర్గారోహణం చేసిన మా నాయనమ్మ కబుర్లు. ఈపాటికి రంభా, ఊర్వశి, మేనకలతో... “కళ్ళుంటే కలకత్తా చూడాలి. లేదంటే బరంపురం చూడాలి.” అనే తన ట్రేడ్‌మార్క్ డైలాగు చెబుతూ, వాళ్ళను భూలోక ప్రయాణానికి ఊరిస్తూ ఉండుంటుంది. ఈ ముసలావిడ మాటలు పట్టుకుని, అప్సరసలెక్కడ భూలోకం వెళతామంటారో అని ఐరావతంపై తలపట్టుకుని కూర్చున్న ఇంద్రుణ్ణి చూసి నవ్వుకుంటూ ఉండుంటుంది. తన కోసం ఇన్ని మాటలు రాస్తున్న ఈ మనవడి వంక ప్రేమగా చూస్తూ... తన రెండు అరచేతులు బోర్లించి దీవిస్తూ ఉండుంటుంది.


స్వస్తి!
రాజన్ పి.టి.ఎస్.కె

583 - 69

Ajagava
Posted 1 year ago

మన "అజగవ" సాహితీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!!

328 - 15

Ajagava
Posted 1 year ago

సుమారు నాలుగేళ్ళ క్రితం మాట. అప్పట్లో ఒకానొకరోజున..

“మనదీ ఒక బ్రతుకేనా? కుక్కలవలె, నక్కల వలె!
మనదీ ఒక బ్రతుకేనా! సందులలో పందులవలె!”

అంటూ శ్రీశ్రీగారు మహప్రస్థానంలోనుండి నావంక చూస్తూ కళ్లెర్రజేయడంతో “మనం ఈ ఉద్యోగాలు గట్రా కాకుండా ఇంకోలాంటిదేదో, ఇంకా మరేదో, ఇంతకంటే కాసింత గొప్పదేదో చేసితీరాల్సిందే” అన్న భావన కోడి రామ్మూర్తి నాయుడుగారికెంత బలముందో అంత బలంగా కలిగింది. అలా ఉరకలెత్తిన ఉత్సాహంతో ఠపీమని లేచి నిల్చున్నాను. కానీ నిల్చొని ముప్పావుగంటైపోయినా ఏం చెయ్యాలో మాత్రం పాలుపోలేదు. పాపం అప్పుడు ఆత్రేయగారు “మౌనమె నీ భాష ఓ మూగమనసా - తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు - కల్లలు కాగానే కన్నీరవుతావు” అని నా గుప్పెడంత గుండెను ఓదారుస్తూ తిరిగి కూర్చోబెట్టారు. నేను ఉసూరుమంటూ మా హాల్లో కుర్చీలవంకా, గోడల వంకా బేలగా చూడసాగాను. ఇంతలో మా గోడమీదనున్న ఫోటోలోనుండి వేటూరిగారు “నేనున్నా కదరా!” అన్నట్లు చిద్విలాసంగా ఓ నవ్వొకటి నవ్వారు. దానితో పాతాళానికి పడిపోయిన నా ధైర్యం ఒక్కసారిగా ఈమధ్య పెరిగిన టమోటోల ధరంతగా పెరిగింది. ఇక క్షణం ఆలస్యం చేయకుండా సిస్టమ్ ఆన్ చేసి Youtube ఓపెన్ చేశాను. ఆదిభిక్షువును అప్పడిగి, ఆయన ధనస్సు పేరుతో ఒక ఛానల్ క్రియేట్ చేశాను. అలా “వేటూరిగారొస్తున్నారు” అనే ఓ సరదా వీడియోతో మన “అజగవ” ఛానల్‌ను ప్రారంభించాను.

ఇక అక్కడనుండి అక్షరాలుగా మిగిలిపోయిన సాహితీకారులందరినీ తోడు తీసుకుని మెల్లగా నడవడం మొదలు పెట్టాను. ఈ కుర్రాడెవరో (క్షమించాలి, నలభై ఏళ్లు దాటినా ఇంకా కుర్రతనం పొకపోవడం వల్ల ఆ పదాన్నే వాడేస్తున్నాను) బుద్ధిమంతుడి బాపతులానే ఉన్నాడనుకుంటూ సాహిత్యాభిమానులు కూడా ఒక్కొక్కరుగా Subscribe బటన్ కొట్టి పలకరించడం మొదలుపెట్టారు. తమకు నచ్చిన వీడియోలను షేర్ చెయ్యసాగారు. అలా ఇప్పటివరకూ అజగవ వీడియోలు Whatsapp. Facebook వంటి మాధ్యమాలలో సుమారు లక్షా నలభై ఎనిమిది వేల సార్లకు పైగా share అయ్యాయి. భేష్ అని భుజం తట్టే అభినందనలు పదహారు వేలకు పైగా కామెంట్ల రూపంలో వచ్చాయి. అలా అభిమానంతో అజగవను పలకరించేవారి సంఖ్య లక్షకు చేరడంతో చిన్నపాటి పులకరింత కలిగి ఈ పోస్ట్ పెడుతున్నాను.

ఇంతకూ మన అజగవలో ఎటువంటి వీడియోలు ఉంటాయో ఇంతవరకూ పలకరించనివారికి తెలిసే అవకాశం లేదుకనుక,, వారికోసమని మన అజగవలో వచ్చిన కొన్ని వీడియోల గురించి క్లుప్తంగా చెప్పుకుంటూ వెళతాను.

అన్నీ వేదాలలోనే ఉంటాయంటారు కదా. మరి ఆ నాలుగు వేదాలలోను, ప్రధానమైన పది ఉపనిషత్తులలోను ఏముందో సంక్షిప్తంగా సుమారు ఓ అరగంట నిడివున్న వీడియోలో చెప్పాను. అలానే మన 18 పురాణాలలో ఏ పురాణంలో ఏముందున్న విషయాన్ని, యోగవాసిష్ఠంలో చెప్పబడ్డ వేదాంత తత్త్వాన్ని వేరు వేరు వీడియోలలో వివరంగానే చెప్పాను. ఇంకా 64 కళల గురించి, యక్ష ప్రశ్నల గురించి, ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాలో ఉన్న భేదాల గురించి, గ్రామదేవతల తమ్ముడైన పోతురాజు కథ గురించి ఇలా అనేక వీడియోలలో బోలెడన్ని విషయాలు చెప్పుకున్నాం.

మనకు కామసూత్రాలు పేరు వినగానే అదేదో అశ్లీల గ్రంథమనే భావన కలుగుతుంటుంది. కాకపోతే అందులో కేవలం లైంగిక జీవితానికే కాక, వ్యవహారిక జీవితానికి కూడా ఉపయోగపడే విషయాలు ఎన్నో ఉన్నాయి. అందుకే వాత్స్యాయన కామసుత్రాలలో ఏముందన్న విషయం గురించి ఒక వీడియో చేశాను.

అలానే “చింతామణి నాటకం” పేరు వినగానే మనకు కలిగే భావన కూడా వేరేగానే ఉంటుంది. కానీ నిజానికి “చింతామణి నాటకం” అన్నది ఆనాటి సమాజంలో పేరుకుపోయిన వేశ్యావ్యామోహమనే జాడ్యాన్ని పోగొట్టడానికి వ్రాయబడిన ఉత్తమస్థాయి నాటకం. చాలాకాలం పాటూ ఆ నాటకాన్ని ఎంతో ఉదాత్తంగానే ఆడినా, ఆ తరువాత కాలంలో కొందరు నాటకాల కంపెనీలవాళ్ళు ఆ నాటకంలో అశ్లీలతను, ద్వంద్వార్థాలను జొప్పించడంతో పాటూ, కొన్నివర్గాలవారిని కించపరిచేలా సంభాషణలు చేర్చారు. దానితో చివరికా నాటకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించే వరకూ వ్యవహారం వెళ్లింది. ఆ చింతామణి నాటకంలో అసలు కథ జనానికి తెలిస్తే బావుంటుందన్న ఉద్దేశ్యంతో దాని మీద కూడా ఒక వీడియో చేశాను.

ఇంకా కాళిదాసు రచనలైన రఘువంశం, మేఘసందేశం, భాసుని స్వప్నవాసవదత్త, బాణుని కాదంబరి, శూద్రకుని మృచ్ఛకటికం ఇలా ప్రాచీన కావ్యాల సారాంశాన్ని కథల రూపంలో చిన్నచిన్న వీడియోలుగా పరిచయం చేశాను.

ఇక విశాఖదత్తుడు రచించిన ముద్రారాక్షసమ్ చాణక్యుని తెలివి తేటలు ఎంత గొప్పవో చెప్పే గ్రంథం. రాక్షసామాత్యుని ఎత్తులను చాణక్యుడు ఎలా చిత్తు చేశాడో, చివరికి సుస్థిరమైన మౌర్య సామ్రాజ్య స్థాపనకు ఎలా తోడ్పడ్డాడో చెప్పే ఈ కావ్య కథను మనం అజగవలో ఈమధ్యనే చెప్పుకున్నాం.

ఇలాంటి ఎత్తులు జిత్తులతో సాగిపోయే మరో గ్రంథం.. వేదం వేంకటరాయ శాస్త్రిగారి ప్రతాపరుద్రీయం. “ఢిల్లీ సుల్తాన్ - నిన్నెతుకుపోతాన్” అని పిచ్చి పిచ్చిగా ఢిల్లీ వీధులలో అరుస్తూ తిరుగుతూ, చివరికి సుల్తాన్ చెరనుండి తన రాజైన ప్రతాపరుద్రుని తెలివిగా విడిపించిన మహామంత్రి యుగంధరుడి కథే ఈ ప్రతాపరుద్రీయం.

ఇంకా మనం కౌటిల్యుడి అర్థశాస్త్రం గురించి, హాలుని ప్రాకృత గాథా సప్తశతి గురించి కూడా విపులంగా చెప్పుకున్నాం. అలానే అష్టవిధ శృంగార నాయికల గురించి, కావ్యనాయికల గురించి వివరిస్తూ ఒక వీడియో చేశాను. అదేవిధంగా శృంగార నాయకులు, కావ్యనాయకుల గురించి కూడా మరో వీడియోలో వివరించాను.

ఇక తొలి తెలుగు నవలగా ప్రఖ్యాతి పొందిన (ఈ విషయం మీద పరిశోధకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనుకోండి!) కందుకూరి వీరేశలింగం పంతులుగారి రాజశేఖర చరిత్ర గురించి, శ్రీనాథుని సరస శృంగార రచన క్రీడాభిరామం గురించి, మాయలఫకీర్ ప్రతినాయకుడిగా ఉండే బాలనాగమ్మ కథ గురించి కూడా వీడియోలు చేశాను.

ఇంకా పింగళి నాగేంద్రరావు గారు రచించిన ఔరంగజేబు కుమార్తె జేబున్నీసా ప్రేమకథ గురించి, చరిత్రలో ఇంతటి క్రూరుడైన రాజుంటాడా అని భయం వేసేలా కథానాయకుడి పాత్రను తీర్చిదిద్దిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి మిహిరకులుడి నవల గురించి కూడా అజగవలో చెప్పుకున్నాం.

తెలుగు పంచకావ్యాలలో మూడు కావ్యాలైన పెద్దన గారి మనుచరిత్రను, రామరాజభూషణుని వసుచరిత్రను, శ్రీకృష్ణదేవరాయల ఆముక్యమాల్యదను చిన్నపాటి కథల రూపంలో చెప్పుకున్నాం.

నేను అప్పట్లో FaceBookలో కవితాపరిచయ షట్కం అన్నపేరుతో కృష్ణశాస్త్రిగారు, శ్రీశ్రీ గారు, దాశరథిగారు, కరుణశ్రీగారు, ఆరుద్రగారు, సినారెగార్ల కవిత్వాలపై వ్రాసిన వ్యాసాలన్నీ కూడా అజగవలో వీడియోలుగా వచ్చాయి. దేశ విదేశీ ప్రముఖుల ఛలోక్తుల గురించైతే నాలుగైదు వీడియోలు చేశాను.

కేవలం సంస్కృతం, తెలుగే కాకుండా అప్పుడప్పుడూ ఇతర భాషా సాహిత్యాన్ని కూడా అజగవ ద్వారా పరిచయం చేస్తూ వస్తున్నాను. తమిళ పంచ కావ్యాలలో ఒకటైన సిలప్పదికారం కథను, తమిళ వేదంగా పిలుచుకునే తిరువళ్లువర్ వారి తిరుక్కురళ్‌ను, తమిళవారికే కాక హిందువులందరికీ ఆరాధనీయమైన తిరుప్పావై పాశురాలను తేలికైన తెలుగులో చిన్నచిన్న వీడియోలుగా అందించాను.

ఉపనిషత్తుల సారంలా కనిపించే లావోత్సూ తావోయిజం గురించి కూడా ఒక వీడియో చేశాను. ఇంకా కన్నడవారికి పూజనీయమైన బసవపురాణం కథను, మర్చంట్ ఆఫ్ వెనిస్, ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ట్వైల్త్ నైట్ వంటి షేక్స్ పియర్ నాటకాలలో కథలను కూడా అజగవలో చెప్పుకున్నాం.

ఇక అజగవకు మంచి గుర్తిపును తీసుకు వచ్చిన కథలు కాశీమజిలీ కథలు. మణిసిద్ధుడనే సాధుపుంగవుడు తన శిష్యుడైన కోటప్పతో కలిసి కాశీకి వెళుతుంటాడు. మధ్య మధ్యలో మజిలీలు చేస్తూ ఆ మజిలీలలో కోటప్ప అడిగే ప్రశ్నలకు కథల రూపంలో సమాధానాలు చెబుతూ సాగిపోతుంటాడు. అలా 360 మజిలీలలో మణిసిద్ధుడు కోటప్పకు చెప్పిన కథలే ఈ కాశీమజిలీ కథలు. 12 సంపుటాల ఈ కథలలో 5 సంపుటాలను 100 భాగాలుగా ఇప్పటికే పూర్తిగా చెప్పుకున్నాం. ఆరో సంపుటిని ప్రస్తుతం చెప్పుకుంటున్నాం.

కాశీమజిలీ కథల పరంపరలానే మనం చెప్పుకుంటున్న మరో కథలసంపుటి భేతాళ కథలు. 2000 సంవత్సరాల క్రితంనాటివైన ఈ అసలు సిసలైన 25 భేతాళకథలలో ఇప్పటివరకూ 5 కథలను చెప్పుకున్నాం. మిగిలిన 20 కథలను కూడా తొందరలోనే చెప్పుకుంటాం.

అలానే ప్రాచీనమైన 8 కూనలమ్మ పదాల గురించి, నూట పదహార్లు అనే మాట వ్యవహారికంలోకి ఎలా వచ్చిందన్న ఆసక్తికర విషయం గురించి, నోరు తిరగని పద్యాలను సులభంగా పలికే విధానం గురించి, ఎటునుండి ఎటు చదివినా ఒకలానే ఉండే భ్రమక పదాల గురించి, వందేళ్ళ క్రితమే పోకూరి కాశీపత్యావధానులుగారు రచించిన కాఫీ దండకం గురించి, ఇంకా బోలెడన్ని చాటు పద్యాలు గురించి, భళా అనిపించే సమస్యాపూరణల గురించి అనేక వీడియోలలో చెప్పుకున్నాం. విశ్వనరుడు, శ్మశానవాటి, శిశువు వంటి జాషువా గారి పద్యాలలో ఉన్న గొప్పదనాన్ని చెప్పుకుని కూడా ఆనందించాం.

ఆధునిక ప్రపంచంలో భీమబలుడిగా ఖ్యాతి గడించిన కోడి రామ్మూర్తి నాయుడు గారి గురించి, బహుముఖ ప్రజ్ఞాశాలియైన అడవి బాపిరాజుగారి వంటి మహామహుల గురించి కూడా సంక్షిప్తంగా చెప్పుకున్నాం.

ఇలా అన్నిరకాల సాహితీ ప్రక్రియల గురించి మన అజగవలో ఎన్నో వీడియోలొచ్చాయి. మరెన్నో వీడియోలు వస్తూనే ఉంటాయి కూడా. అందుకు కావలసిందల్లా మీ అభిమానం, ఆశీస్సులు. ఇంతకాలంగా మన అజగవను ఎంతగానో అభిమానిస్తూ ఆదరిస్తున్నవారికీ, “ఇంతవరకూ నీకో ఛానల్ ఉందన్న సంగతే మాకు తెలియదు. సరే ఇక నుండి మా ఆశీస్సులు కూడా నీకుంటాయ్” అని దీవించబోయేవారికీ కూడా నమస్కరించుకుంటూ, చివరిగా ఒకమాట. సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.com కు email చెయ్యండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి. స్వస్తి!

మీ రాజన్ పి.టి.ఎస్.కె
—-------------------------------------

664 - 34

Ajagava
Posted 2 years ago

“అలా చెయ్యకూడదురా భడవా!” అంటూ ఆ కాలంలో చెవి మెలేసి బుద్ధి చెప్పిన అమ్మపై.. ఆపై కాలంలో “అలా ఎందుకు చేశావ్, ఇలా ఎందుకు చేశావ్” అని విసవిసలాడిపోతూ ముసుగు తన్ని పడుకున్న రోజులు కొన్నున్నాయ్. ఇరవై ఏళ్ళ వయస్సులో మొదటిసారి అమ్మకు దూరంగా వేరే ఊరిలో ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు, బాధతో విలవిలలాడిపోతూ కన్నీళ్లు పెట్టుకున్న రోజులూ మరికొన్నున్నాయ్. కానీ.. కోపంలో నేను అంతెత్తున ఎగిరెగిరి పడినప్పుడు మా అమ్మ నాతో ఏమనేదో, తనమీద బెంగతో ఫోనులో నా గొంతు జీరబోయినప్పుడూ కూడా మా అమ్మ అదే మాట అనేది.. “అలా కాదురా నాన్నా” అని. నాకు, అక్కకు చిన్నపాటి జ్వరం వచ్చినా బెంబేలెత్తిపోవడం, మేము స్కూల్ నుండి రావడం కాస్తంత ఆలస్యమయినా గాబరా పడిపోవడం, నేను ఊరునుండి రాగానే ఆనందంతో కావలించుకోవడం ఇవన్నీ నేను అప్పట్లో ప్రత్యక్షంగాను, ఇప్పటికీ నా మనసుతెరపై సుస్పష్టంగాను ఎన్నోసార్లు చూసిన, చూస్తున్న దృశ్యచిత్రాలు.


అలా అని మా అమ్మ కేవలం సాత్త్వికత్వం మాత్రమే మూర్తీభవించిన అమాయకురాలంటే మాత్రం అది అక్షరాలా అసత్యమైపోతుంది. మా అమ్మ విషయంలోనే కాదు; ఏ అమ్మ విషయంలోనైనా అంతే. అన్నం వద్దంటూ మారాం చేసే పిల్లలు, వాళ్ళ వీపులు సాపు చేసి, కన్నీళ్లు తుడుస్తూ మరీ అన్నం తినిపించేసే తల్లులూ లేని ప్రదేశం ఈ భూమండలంలో ఎక్కడైనా ఉంటుందా? అల్లరి అదుపు తప్పేస్తున్నప్పుడు దబదబమని శబ్దాలంకారాలు ప్రయోగించి, అదే జోరుతో జోకొట్టి మరీ నిద్రపుచ్చే తల్లులకు ఈ లోకంలో కొదవుంటుందా? “యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత..” అంటూ భారీ లెవెల్లో లెక్చరిచ్చిన అంతటి జగన్నాటక సూత్రధారి కూడా, తన చిన్నతనంలో తల్లి చేతిదెబ్బలు రుచిచూడకుండా తప్పించుకోలేకపోయాడు. ఇక మనబోటివారం ఎంత! ఆ మాటకొస్తే అప్పటి మహమహా చక్రవర్తుల దగ్గర నుండి ఇప్పటి ప్రధానులూ, ముఖ్యమంత్రుల వరకూ అందరి వీపులూ తమ తల్లుల అరచేతులతో సుదృఢమైన సంబంధాలు కలిగినవే అయ్యుంటాయి. కాకపోతే అవన్నీ ఆత్మకథల్లోకి, జీవితచరిత్రల్లోకి ఎక్కవంతే; చెబితే నవ్వుతారని. “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గూ” అనే బాపతు వాళ్లెవరైనా ఒకరిద్దరు చెప్పుకుంటే చెప్పుకునుండవచ్చు. వారంతా దెబ్బలు మాగట్టిగా తగిలిన ధన్యజీవులని అర్థం.


అమ్మ ప్రేమైనా, కోపమైనా చిత్రంగానే ఉంటుంది. ప్రేమ ఎంత నిఖార్సుగా స్థిరంగా ఉంటుందో, కోపం అందుకు భిన్నంగా ప్రేమతో కలగలిసి జావకారిపోతుంటుంది. “నీ జాతకంలో మహర్దశ ఉందయ్యా!” అని ఏ జ్యోతిష్కుడైనా చెప్పాడంటే కనుక.. ఆ జాతకుడికి అమ్మ పక్కనే ఉందని అర్థం. నేను అటువంటి మహర్జాతకం పట్టిన వాడిని. ఉదయం లేవగానే “అమ్మా” అని పిలుస్తూ కళ్లు తెరవడానికీ, బయటకువెళ్లినప్పుడల్లా అమ్మ పాదాలకు నమస్కరించడానికి అవకాశం అదృష్టం ఉన్నవాడిని. 63 సంవత్సరాల క్రితం అరసవల్లి బ్రహ్మంగారు, లక్ష్మీనరసమ్మలకు పుట్టిన ఈ సత్సంతానానికి రెండో సంతానంగా పుట్టిన వాడిని. ఇలా అమ్మ గురించి నలుగురిలో నాలుగుమాటలు చెప్పడానికి అమ్మ పుట్టినరోజన్నది ఒక సాకు మాత్రమే. వాదాలు వివాదాలు సినిమాలు షికార్లు ఇలా రకరకాల కబుర్ల హోరుతో వేడెక్కిపోయిన హృదయాలకు “అమ్మ” గురించిన మాటలు చల్లదనాన్ని ఇస్తాయి. అందుకే ఇన్ని మాటలు.


“ఆకలి తీరాలంటే.. “అమ్మ” అన్నం పెట్టాలి.
తెలివి పెరగాలంటే.. “అమ్మ” కథలు చెప్పాలి.
ధైర్యం పొంగాలంటే.. “అమ్మ” భుజం తట్టాలి.
ఒప్పు తెలియాలంటే.. “అమ్మ” తప్పు దిద్దాలి.
దెబ్బ తగ్గాలంటే.. “అమ్మ” కట్టు కట్టాలి.
నిద్ర పట్టాలంటే.. “అమ్మ” జో కొట్టాలి.
ఇలా ఏం చేసినా అమ్మే చేయాలి.
మనం ఎంత ఎదిగినా అమ్మే కావాలి.”


అమ్మలందరికీ సాష్టాంగ దండప్రణామములు - మా అమ్మ “లక్ష్మీరాజేశ్వరి”కి పుట్టినరోజు శుభాకాంక్షలు!


“అమ్మకొడుకు” రాజన్ పి.టి.ఎస్.కె.

—-----------------

846 - 125

Ajagava
Posted 3 years ago

“వినదగునెవ్వరు చెప్పిన” అన్నాడు సుమతీ శతకకారుడు. అందుకే వినేవాళ్ళు కొందరైనా ఉండకపోతారా? అన్న ధైర్యంతో రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఒక Youtube ఛానల్ ప్రారంభించాను. నీ ఛానల్‌లో నాకూ ఏదో ఒక పాత్ర ఉండాల్సిందే అని పట్టుబట్టిన సాంబశివుడి మాట కాదనలేక, ఆయన ధనస్సు పేరైన “అజగవ”నే నా ఛానల్ పేరుగా పెట్టేశాను.
“పినాకో౽జగవం ధనుః” అంటూ శివుని ధనస్సు పేర్లను చెబుతుంది అమరకోశం. తన డమరు ధ్వనితో అక్షరాన్ని పుట్టించిన ఆ పరమేశ్వరుని ధనస్సుల పేర్లు “పినాకము”, “అజగవ”మూనట. మన తిక్కనగారు కూడా విరాటపర్వం మొదలు పెడుతూ..
“అజగవ శార్‌ఙ్గాలంకృత! భుజగర్వ నిరస్తదైత్య! భూమస్తుత్యా!
త్రిజగద్ధారణ నిత్యా! భుజగ సమాచరిత శయన భూషణ కృత్యా!” అంటూ హరిహరనాథ స్వరూపాన్ని దర్శించి నమస్కరించుకున్నాడు.
“అజగవము, శార్‌ఙ్గము అనే ధనస్సులు రెండు భుజముల యందూ ధరించి, బలగర్వితులైన రాక్షసులను దునుమాడినవాడా, అనేకానేక విధాలుగా కీర్తింపదగినవాడా, మూడులోకాలకూ ఆధారమైనటువంటివాడా, ఆదిశేషువనే సర్పాన్ని శయనంగానూ, వాసుకీ అనే సర్పాన్ని కంఠాభరణంగానూ చేసుకున్న ఓ దేవాదిదేవా, హరిహరనాథా! నీకు నమస్కారము.” అన్నది ఈ శ్లోకానికి అర్థం. ఇక్కడ శార్‌ఙ్గము మహావిష్ణువు ధనస్సైతే, అజగవము మహేశ్వరుని ధనస్సు. అలా “అజగవ” అన్నది నా ఛానల్ పేరు అయ్యింది. మరి లోగో ఏం పెట్టాలా అని చాలాసేపు తర్జనభర్జన పడి, చివరికి “అరే ఇది మా లోగోని పోలి ఉందే” అని ఎవ్వరూ కాపీరైటు క్లెయిమ్ చేసే అవకాశం ఇవ్వకుండా, నా పేరునే అందుకు వినియోగించి మమ అనిపించాను. కేవలం సాహిత్యానికి సంబంధించినవి తప్ప మరే విషయాల జోలికీ వెళ్ళకూడదన్నది తొలి నియమంగా, Thumbnailలోనే ఆ వీడియోలో ఏముందో స్పష్టంగా చెప్పేయాలన్నది మలి నియమంగా పెట్టుకున్నాను.

ఛానల్, లోగో, నియమాలు సిద్ధమయ్యాయి కనుక, ఆ మరునాడు పొద్దున్నే పని మొదలు పెట్టాను. మొదట ఎవరితో ప్రారంభించాలన్నది ముందుగానే నిర్ణయించుకున్నాను కనుక.. “వేటూరిగారొస్తున్నారు” అనే నా FaceBook టపానే ఆడియోగా మలిచాను. నా మొబైల్ ఫోన్‌లోనే రికార్డింగ్ చేసి, గూగుల్ వాడి సహాయంతో దానికి Thumbnail ఎలా పెట్టాలో నేర్చుకుని, వీడియో రెడీ చేశాను. మా అమ్మ కాళ్ళకు నమస్కారం చేసోచ్చి.. వీడియో అప్‌లోడింగ్ ప్రారంభించాను. “చెప్పేవాడికి వినేవాడు లోకువరా అబ్బాయ్” వంటి కామెంట్లు రాకుండా ఉంటే చాలనుకుంటూ.. బెరుకు బెరుకుగానే వీడియో లైవ్ చేశాను. భగవంతుడు నా మొర ఆలకించాడు. వీడియో అప్లోడ్ చేసి గంట గడిచినా అటువంటి కామెంటేదీ రాలేదు. హమ్మయ్య అనుకున్నాను. కానీ ఇంతలో.. కనీసం ఒక్కరైనా ఆ వీడియోను చూస్తేనే కానీ, కామెంటుకు అవకాశం ఉండదన్న ఎరుక కలగడంతో, ఈసారి మొదటి కామెంటు కోసం కాకుండా, మొదటి వ్యూ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగాను. రెండో గంటలో అయిదు వీక్షణలు, ఆ రోజు మొత్తం మీద 18 వీక్షణలు వచ్చాయి. వీక్షణలు పెరిగాయా లేదా అనుకుంటూ మాటికీ youtube చూస్తుంటే.. “కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” - “అర్జునా.. కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉంది, వాటి ఫలితాలను ఆశించడంలో లేదు” అంటూ వెనుక నుండి కృష్ణపరమాత్మ ఘంటశాల గారి గొంతుతో అదే పనిగా చెబుతున్నట్టు అనిపించడంతో, ఇక ఆరోజుకి Youtube క్లోజ్ చేసేశాను.

ఆ మర్నాడే ఇద్దరు సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. శివకేశవులనుకున్నాను. ఆ ఉత్సాహంతో ఆ తరువాత పదిరోజుల్లోనే 5 వీడియోలు పెట్టాను. నిజానికి అన్నీ ఆడియోలే. దానితో మరో ఆరుగురొచ్చారు. మొత్తం ఎనిమిది మంది. శివుడి అష్టమూర్తి తత్వం అనుకున్నాను. అక్కడనుండి ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టున్నాడు. కదల్లేదు. ఇంకో వారం గడిచిపోయింది. రెండువారాలు గడిచిపోయాయి. ఊహు.. ఆ అష్టమూర్తిలో ఉలుకూ పలుకూ లేదు. నాకు ఉక్రోషం వచ్చింది. నీ ఇష్టమొచ్చింది చేసుకో అంటూ వదిలేశాను. అలా వదిలేసిన ఆరు మాసాలకు మళ్ళా ఒకసారి నా Youtube తెరచి చూశాను. 69మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అయినా పెద్దగా ఉత్సాహం లేదు. ఇంకొక వారం తరువాత చూశాను. 300మంది ఉన్నారు. ఇదేంటి మనం వీడియోలు పెట్టడం మానేసే 6 నెలలు అయ్యింది కదా! అనుకుంటూ,, ఏ వీడియో చూస్తున్నారా అని నా ఛానల్‌లోకి తొంగి చూశాను. “పండితుని కవిత్వంతో కొట్టిన నెరజాణ” - నేను పెట్టిన నాలుగవ వీడియో. 5 వేల వీక్షణలున్నాయి. “అమ్మా! అయిదువేలమంది చూశారే మన వీడియోని” అన్నా ఆనందంగా. అమ్మ పొంగిపోయింది. మంతెనవారి వీడియోలు చూసి చేసిన డ్రైఫ్రూట్ లడ్డూ తెచ్చి నోట్లో పెట్టింది. అరెరె ఇంతకాలం అనవసరంగా డీలాపడిపోయానే అనుకుని మరలా తమాయించుకుని, అయినా పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదన్నారుగా మన పెద్దలు అనుకుంటూ కొత్త ఉత్సాహంతో మరలా వీడియోలు చేయడం మొదలు పెట్టాను.

ఏదైనా సిరీస్‌లా చేస్తే బావుంటుందన్న ఆలోచన రావడంతో మరి కొంత ఆలోచన చేసి కాపీరైటు ఇబ్బందులు లేని మధిర సుబ్బన్న దీక్షితుల గారి “కాశీమజిలీ కథల”ను ఎంచుకున్నాను. భారతీయ కాపీరైటు చట్టం ప్రకారం ఒక రచయితకు తాను జీవించినంతకాలం తన రచనలపై పూర్తి హక్కులు ఉంటాయి. అతను మరణించిన అరవై సంవత్సరాల తరువాత వచ్చే జనవరి 1వ తారీఖు వరకూ కూడా ఆయన రచనల మీద పూర్తి హక్కులు ఆ రచయిత వారసులకే ఉంటాయి. ఆ తరువాతనే అవి ఎవరన్నా వాడుకోవడానికి అనువుగా కాపీరైటు చట్రంలోనుండి బయటకు వస్తాయి. ఉదాహరణకు, కొడవటిగంటి కుటుంబరావుగారి రచనలను తీసుకుందాం. ఎవరైనా వారి రచనలను మరలా ప్రచురించాలనుకున్నా లేదా YouTubeలో చదవాలనుకున్నా, అప్పుడు వెయ్యవలసిన లెక్కేమిటంటే.. ఆయన మరణించినది 17th Aug 1980 కనుక అప్పటి నుండి 60 సంవత్సరాలు అంటే 17th Aug 2040 అవుతుంది. ఆ తరువాత వచ్చే జనవరి 1వ తారీఖు అంటే 1st January 2041 వరకూ కూడా, అంటే సుమారుగా మరో ఇరవై యేళ్ళ పాటూ మనం ఆయన రచనల జోలికి పోకూడదు. కేవలం కొడవటిగంటి కుటుంబరావుగారి రచనలపై కాపీరైటు హక్కు ఉన్న వారి దగ్గరనుండి లిఖిత పూర్వకమైన అనుమతి తీసుకున్నాకే వాటిని మనం వాడుకోగలం.

ఇక కాశీమజిలీ కథల కర్త అయిన మధిర సుబ్బన్న దీక్షితులు గారు మరణించినది 1928లో కావడంతో.. అలా కాపీరైటు ఇబ్బందులు లేని 12 సంపుటాల కాశీమజిలీ కథలను ఎంచుకున్నాను. గ్రాంథికంలో ఉన్న ఆ కథలను కొందరు ఇప్పటికే సరళమైన భాషలో వ్రాసి ప్రచురించారని తెలిసినా, నేను ఆ అనువాదాల జోలికి పోలేదు. మధిర సుబ్బన్న దీక్షితులవారు వ్రాసిన భాషలోనే ఆ కథలను చదవాలనుకున్నాను. నెట్‌లో వెతకగా, కాశీమజిలీ కథలు మొదటి సంపుటి 1934 ఎడిషన్ దొరికింది. ముందు ఇది చెబుదాం.. ఇది అయ్యే సరికి ఎలానూ రెండు మూడు నెలలు పడుతుంది కదా అనుకున్నాను. అలా గ్రాంథికంలో ఉన్న కథలను వాడుకభాషలోకి వ్రాస్తూ, కథలా చదవడానికి అనువుగా కొద్దిపాటి మార్పులు చేర్పులూ చేస్తూ, ఒక్కో కథనూ చెప్పడం మొదలు పెట్టాను. ముందుగా విధించుకున్న నియమం ప్రకారం Thumbnailsలో కూడా సరళత పాటించాను. అలా ఆ కథలు చెప్పడం మొదలు పెట్టిన 20 రోజులలోనే సబ్‌స్క్రైబర్స్ 1500 వందలకు పెరిగారు. ఇంకా ఉత్సాహంతో వారానికి రెండు కథలు చొప్పున చెప్పసాగాను. మధ్యలో శ్రీశ్రీ గారి కవితాపరిచయం, కృష్ణశాస్త్రిగారి కవితాపరిచయం, దాశరథి గారి కవితా పరిచయం తెలుగులో ఉన్న భ్రమక పదాలతో పొడుపు కథలు, చాటు పద్యాలు, తెలుగులో తప్పక చదువ వలసిన కొన్ని పుస్తకాలు, మా నాయనమ్మ చెప్పిన కబుర్లు - జానపద సాహిత్యం, ఇలా మరి కొన్ని ఆడియో వీడియోలు కూడా పెట్టసాగాను. “అజగవ”కు ఆదరణ పెరగడం మొదలయ్యింది.

BSNLలో D.E. గా పనిచేసి రిటైర్ అయిన రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ మందలపర్తి కృష్ణారావుగారనే 77 సంవత్సరాల పెద్దాయన, ఎంతో అభిమానంతో, తాను సుమారు నలభై, నలభై అయిదేళ్ళ క్రితం కొనుక్కున్న కాశీమజిలీ కథల సంపుటాలన్నింటినీ నాకు పంపించి ఆశీర్వదించారు. వారితో నాకు ఏ పూర్వ పరిచయమూ లేదు. కేవలం నా వీడియోలు చూసి, ఆయనంతట ఆయనే నా ఛానల్ తలుపు తట్టారు. దానితో ఇక కాశీమజిలీ కథలు చెప్పడానికి ఏ చిన్నపాటి ఇబ్బందీ లేకుండా పోయింది. అలా ఇప్పటికి 81 భాగాలుగా నాలుగు సంపుటాలలోని కథలు చెప్పాను. మరో వారంలో నాలుగవ సంపుటం కూడా పూర్తవుతుంది.

ఇలా జానపద కథలు, పురాణ కథలు, చాటువులు, కవి - కవిత్వ పరిచయాలు, ప్రముఖుల సరదా ఛలోక్తులు, నాలుక తడబడే పద్యాలు, పెద్దన గారి ఉత్పలమాలిక దాని అర్థం, పొడుపు కథలు ఇలా ఒకటేమిటి సాధ్యమైనవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయంలో మాత్రమే ఈ పని చేయగలను కనుక, నెలకు ఏడు లేదా ఎనిమిది వీడియోలు మాత్రమే పెట్టగలుగుతున్నాను. ఒక భాగం కాశీమజిలీ కథ చెప్పాలంటే.. ఆ కథ చదవడానికి, దానిని తెలుగులో వ్రాయడానికి, వ్రాసింది రికార్డ్ చేయడానికి, దానిని ఎడిట్ చేసి అప్లోడ్ చెయ్యడానికి కనీసం 12 నుండి పద్నాలుగు పని గంటలు అవసరం పడుతోంది. అలానే మిగిలిన వీడియోలు కూడాను. కాస్తంత అలసట కలుగుతూనే ఉన్నా, మన ఛానల్‌కు వచ్చే వారి సంఖ్య, కామెంట్లలో అభినందించేవారి సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతుండటంతో, ఆనందంగానే ఉంది. ఈ రెండు సంవత్సరాలలో ఇప్పటికి 150 వీడియోలు పెట్టాను. 55,000 మందికి పైగా సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. 42 లక్షల వీక్షణలు, నాలుగున్నర లక్ష వాచ్ అవర్స్ వచ్చాయి. ఈ రోజు మన “అజగవ” రెండవ పుట్టినరోజు. తన ధనస్సును సాహితీ ధనువుగా వాడుకుని వాటినుండి సాహిత్య విషయాలనే బాణాలను సంధించడానికి అనుమతి అనుగ్రహించిన ఆ పార్వతీపతికి నమస్కరించుకుంటూ, మీ అందరి ఆశీర్వాదాలనూ కోరుకుంటూ స్వస్తి!
మీ రాజన్ పి.టి.ఎస్.కె.
మన అజగవ ఛానల్ లింక్: youtube.com/ajagava
----------------------------------------

672 - 88

Ajagava
Posted 4 years ago

మన "అజగవ" సాహితీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!!

518 - 21

Ajagava
Posted 4 years ago

తెలుగుతనం ఉట్టిపడే కథల కోసం తెలుసుకోవాలంటే శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి కథలు చదవాలి. మన సంఘపు పోకడల మీద సెటైరిక్ రచనలు చేయాలంటే “సాక్షి” వ్యాసాల సరళిని ఆపోసన పట్టాలి. కొత్త పదాల సృష్టి చేస్తూ జనరంజకమైన మాటలు, పాటలు వ్రాయాలంటే పింగళి గారి రచనలను గమనించాలి. కథ, నవల, పద్యం ఇలా ఏ రచనా సంవిధానంలో అయినా అత్యున్నత స్థాయి ప్రమాణాలు చూడాలనుకుంటే విశ్వనాథ వారి రచనల్లో లోతును, ఎత్తునూ పట్టుకోగలగాలి. తెలుగులో పాపులర్ నవలా రచన ఎలా చెయ్యాలి అన్న విషయం తెలుసుకోవాలంటే… పాతికేళ్ళ పాటు ఆ రంగంలో అగ్రస్థానంలో నిలబడ్డ యండమూరి పుస్తకాలను తిరగెయ్యాలి. హాస్యరస ప్రధానమైన మంచి తెలుగు సినిమా ఎలా తియ్యాలో తెలుసుకోవాలంటే జంధ్యాల సినిమాలను అధ్యయనం చెయ్యాలి. ఇంకా గానానికి సంబంధించి, సంగీతానికి సంబంధించి మన సందేహాలు తీర్చడానికి ఆయా రంగాలలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నవారెందరో ఇప్పటికీ జీవించే ఉన్నారు. ఈ విషయాలకు సంబంధించి ఎన్నో భాషలలో వచ్చిన ఉత్తమస్థాయి పుస్తకాలకూ కొదవలేదు. ఇలా లౌకికమైన ఏ విషయం గురించి మనం తెలుసుకోవాలన్నా, కాలానికి నిలబడ్డ ప్రామాణికమైన రచనలు చాలానే ఉన్నాయి.

అయితే ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలలోను, హిందూ మతానికి, ధర్మానికీ సంబంధించిన అంశాలలోనూ మనకు ఉన్న సందేహాలను తీర్చకోవడం ఎలా? ఫలానా విషయానికి ఇది ప్రామాణికం, ఇంకొక విషయానికి అది ప్రామాణికం అని చెప్పగలవారెవ్వరు? ఈ విషయాలలో కూడా మనకు మన పురాతన ధర్మసూత్రాలూ, ఎందరో గురువుల ఉపదేశాలూ పుస్తకాల రూపంలో లభిస్తున్నాయి. కానీ కొన్నికొన్ని సందర్భాలలో మనకు ఆ ధర్మసూత్రాలను అర్థం చేసుకోవడంలో తికమక ఏర్పడవచ్చు. ఆ యా గురువుల బోధలలో భేదాలుండుండవచ్చు. మరి అలాంటప్పుడు, ఎవరైనా ఒక మహాపురుషుడు ఒక మాట చెబితే, దానినే ప్రమాణంగా తీసుకుని ఆచరించగలిగేంతల్లా మన హృదయం ఆ గురు చరణారవిందముల దగ్గర లగ్నమవ్వగలదా? అటువంటి ఆచార్యశేఖరుడు అసలు ఉన్నాడా? ఇటువంటి సందేహాలకు సమాధానం సుమారు 125 సంవత్సరాల క్రితమే జన్మించింది. చంద్రమౌళీశ్వర వరప్రసాదమై ప్రభవించి, ఆదిశంకరావతారమై నడయాడి, 87 సంవత్సరాలపాటూ కంచికామకోటి పీఠాధిపత్యం వహించి, ఆసేతు హిమాచలం తన జ్ఞానబోధతో ఆధ్యాత్మిక వెలుగులు నింపిన, నడిచే దేవుడు, శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ మహాస్వాముల వారి బోధలే మన సందేహాలను ఆసాంతం తీర్చి, ముందుకు నడిపించగల సప్రామాణిక గ్రంథరాజములు, విజ్ఞానతేజములు, ఆధ్యాత్మికోన్నతికి మార్గములు.

స్వామి వారు వివిధ సందర్భాలలో చేసిన ఉపదేశాలను “జగద్గురు బోధలు” అన్న పేరుతో సాధన గ్రంథ మండలి వారు తెలుగులో అనువదింపజేసి పది సంపుటాలుగా ప్రచురించారు. అలాగే “కంచి శ్రీ మహాస్వామి శతాబ్ది ప్రచురణలు” వారు “ఆచార్యవాణి” అన్న పేరుతో స్వామివారి బోధలను తెలుగులో రెండు సంపుటాలుగా ప్రచురించారు. మొదటి సంపుటంలో అద్వైతము, వైదికమతము, గురుసంప్రదాయముల మీద వారు చేసిన ఉపన్యాసములున్నాయి. ఇక రెండవ సంపుటములో వేదముల మీద చేసిన ప్రసంగాలున్నాయి. వేదములు, వేదాంగములు, వేదాంతమైన ఉపనిషత్తులు, ఉపాంగములు ఇలా అన్నింటి మీదా స్వామి వారు చేసిన బోధలు సుమారు 200 పేజీల ఈ పుస్తకంలో అక్షరాలనిండా ఆధ్యాత్మికతను నింపుకొని నిక్షిప్తమై ఉన్నాయి.

“మతమంటే కేవలం కర్మకాండ కాదు. మతమంటే ధర్మం. దేని ఆచరణ వల్ల మనకు సంతృప్తీ, సంతోషమూ కలుగుతాయో అదే ధర్మమంటే.” అంటారు ఆచార్యులవారు. మన మతానికి గుండెకాయ అని చెప్పదగినవి చతుర్వేదాలు. అవే ప్రమాణాలు. వేదాలు అనాది. అవి ఒకరు వ్రాసినవి కావు. సృష్టికర్తతో పాటూ ఆవిర్భవించాయి. సృష్టికర్త వీటిని అసలు ప్రత్యేకించి సృష్టించలేదంటారు. వేదాలంటే సాక్షాత్తూ పరమాత్మ నిశ్వాసమే.
యోగశాస్త్రం ప్రకారం మనస్సులోని మౌనాంతరాళంతో సంధానమవగలిగితే, అంతరిక్షంలో తేలుతున్న శబ్దాలన్నీ వినిపిస్తాయి. విశ్వమంతటితో తాదాత్మ్యం చెందగలవారికే ఇది సాధ్యమంటారు. అటువంటి శక్తికల ఋషులు లోకశ్రేయస్సుకై ఆ వేదమంత్రాలను గ్రహించి మనకు అనుగ్రహించారే తప్ప వాటిని వారు సృష్టించలేదు.

వేదాలను వేదాంగాలు, ఉపాంగాలతో కలిపి అధ్యయనం చేయాలి. ఇవి పద్నాలుగు- నాలుగు వేదాలు (ఋక్, యజుః, సామ, అధర్వ), ఆరు వేదాంగాలు (శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము), నాలుగు ఉపాంగాలు (మీమాంస, న్యాయం, పురాణం, ధర్మశాస్త్రం)

“అసలు వేదకాలం గురించి పరిశోధన అన్న మాటే తప్పు” అంటారు స్వామి. పరిశోధకుల ప్రకారం కాలనిర్ణయానికి ఉపకరించే విషయాలు రెండు. ఒకటి భూగోళశాస్త్రపు ఆధారాలు. రెండవది రచనలో వాడిన భాష.

వేదాలలో ప్రస్తావించబడిన నక్షత్రాల ఉనికిని, గ్రహాల కూడలిని అనుసరించి, జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం కొందరు వేదాలు క్రీ.పూ. 6000 నాటివనన్నారు. కానీ అటువంటి గ్రహాల కూడలి ఈ విశ్వసృష్టికి సంబంధించే కాకుండా అంతకు పూర్వం కూడా సంభంవించి ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తారు ఆచార్యులవారు.
అలాగే భాషకి శైలీ, లిపీ ప్రధానమైన అంశాలు. పూర్వకాలంలో రాజులు శాసనాలనూ, ప్రకటనలనూ రాళ్ళపైనా, రాగిరేకులపైనా చెక్కించేవారు. వీటిని పరీక్షిస్తే కాలక్రమేణా వచ్చిన మార్పులు స్పష్టంగా తెలుస్తాయి. ఒక శాసనం ఏ కాలందో తెలుసుకోవడానికి లిపి ఉపయోగపడుతుంది. వేదాల విషయం తీసుకుంటే ఇవి ఎక్కడా ఏ రాతిపైనా చెక్కబడలేదు. అందువల్ల కాల నిర్ణయానికి లిపి ఉపయోగించే ప్రసక్తే లేదు. ఇక మిగిలినదల్లా భాషా శైలిని పరీక్షించడం.

ప్రాచీన తమిళ సాహిత్యంలో వాడిన పదాలు మనకు ఇప్పుడు అర్థమే కావంటారు. ఇదే పరిస్థితి ఇతర భాషలలోనూ ఉందంటారు. కొన్ని శబ్దాలు కాలానుగుణంగా మారిపోయాయి. వాటి అర్థం కూడా మారిపోయింది. పరిశోధకుల అంచనా ప్రకారం ప్రతీ రెండువందల సంవత్సరాలకూ ఏ భాషలోని పదాల ఉచ్చారణ అయినా చాలా మార్పులకు లోనవుతుంది. కానీ... వేదాలు అలా కాదు. వేదాలలో శబ్దం ప్రధానం. ఉచ్చారణే కీలకం. అందుకే ఆ శబ్దంలో మార్పు లేకుండా చూడడంలో చాలా జాగ్రత్త చూపిస్తారు. అందుకే వేద శబ్దాలు మామూలు మాటల వలే ఎటువంటి మార్పూ చెందలేదంటారు.

అలాగే మంత్రం కోసం “మననాత్ త్రాయతే ఇతి మంత్రః” అని అర్థం చెబుతూ - నిరంతరం మననం చేయడం వల్ల రక్షించేదే మంత్రమంటారు. ఈ మంత్రాన్ని ఆరు రకాల పద్ధతులలో జపించకూడదట. అవి…
గీతీ... అంటే పాటవలె మంత్రాన్ని ఆలపించడం.
శీఘ్రీ... అంటే వేగంగా మంత్రాన్ని చెప్పి హఠాత్తుగా ఆపేయడం.
శిరః కంపీ... అంటే శిరస్సు ఊపుతూ మంత్రం చదవడం.
లిఖిత పాఠకః... అంటే వ్రాసిన దానిని చదవడం.
అనర్థజ్ఞః... అంటే అర్థం తెలియకుండా మంత్రజపం చేయడం.
అల్పకంఠశ్చ... అంటే హీనస్వరంతో ఉచ్చరించడం.
ఈ ఆరు రకాలుగా మంత్రాన్ని చదవకూడదు.


వేదాలకోసం చెబుతూ… నాలుగు వేదాలలో కలిపి మంత్రాలనబడే 20,500 ఋక్కులుంటే, ఒక్క ఋుగ్వేదంలోనే 10,170 ఋక్కులున్నాయంటారు.

ఋగ్వేదం అగ్నిపై సూక్తంతో ప్రారంభించి దానితోనే ముగుస్తుంది.
“అందరూ కలిసి ఏకమానసులై ఆలోచింతురు గాక. అందరి హృదయాలూ ప్రేమతో బంధిపబడుగాక, అందరికీ ఒకే లక్ష్యముండుగాక, అందరూ ఏకోన్ముఖులై సంతుష్టులగుదురు గాక.”- ఈ వాక్యాలతో ఋగ్వేదం సమాప్తమవుతుంది. సకలదేవతా స్తోత్రాలు కలిగి ఉండడాన్నే ఋగ్వేదం విశిష్టతగా చెబుతారు. సామాజికంగా వ్యక్తి ఎలా ప్రవర్తించాలో కూడా ఈ వేదం చెబుతుంది.


స్తోత్రంతో ఆరాధించడం ఋగ్వేదం నేర్పితే, ఈ మంత్రాలనే, యజ్ఞం చేయడానికి ఎలా ఉపయోగించుకోవాలో నేర్పేది యజుర్వేదం. యజుర్వేదంలో ముఖ్యమైన శాఖలు రెండు. శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము. అద్వైతసిద్ధాంతాన్ని అవలంబించే వాళ్ళకు యజుర్వేదం అత్యంత ప్రధానమైనదట.

ఈ విషయాల గురించి ప్రస్తావిస్తూ… సిద్ధాంతానికి ఏమేం ఉండాలో చెబుతారు. ఏ సిద్ధాంతానికైనా ఒక సూత్రముండాలి. దానికొక భాష్యముండాలి. దానికొక వార్తికముండాలి అంటారు. “సిద్ధాంతాన్ని క్లుప్తంగా చెప్పేది సూత్రం.
ఆ సూత్రానికి వివరణ ఇచ్చేది భాష్యం.
ఆ భాష్యానికి ఇంకా వివరమైన వ్యాఖ్యానమిచ్చేది వార్తికం.”
అంటూ వాటిని కూడా వివరిస్తారు.
ఉపనిషత్తులను సూత్రాలు అనుకుంటే, వాటికి భాష్యాన్ని ఆదిశంకరులు వ్రాశారు. ఆ భాష్యంపై వార్తికం రచించింది ఆదిశంకరుల శిష్యులైన సురేశ్వరాచార్యులు.

ఇక సామవేదం విషయానికి వస్తే… భారతీయ సంప్రదాయ సంగీతంలోని సప్తస్వరాలకూ ఆధారమూ, మూలమూ సామగానమే. ఋగ్వేదంలోని ఋుక్కులకు సామవేదంలో మనోహరమైన సంగీతం కూర్చబడి ఉంటుంది. ఋగ్వేదమంత్రాలను ఉదాత్త, అనుదాత్త స్వరాలతో పఠిస్తారు. కానీ సామవేదంలో వాటిని దీర్ఘస్వరాలతో గానం చేస్తారు. ఈ సామవేదం ఎంత గొప్పదంటే… భగవద్గీతలో సాక్షాత్ పరమాత్మ అయిన శ్రీకృష్ణభగవానుడు వేదాలలో సామవేదాన్ని నేను అంటాడు. లలితా సహస్రంలో కూడా లలితాదేవికి గల నామాలలో సామగానప్రియ అన్నదొకటి.

ఇతర వేదాలలో పేర్కొనబడని దేవతలకి సంబంధించిన మంత్రాలు, సృష్టికి సంబంధించిన మంత్రాలు అధర్వవేదంలో ఉన్నాయి. దశోపనిషత్తులలోని ముఖ్యమైన మూడు ఉపనిషత్తులు... ప్రశ్న, ముండక, మాండూక్యోపనిషత్తులు ఈ వేదంలోనివే. ఈ అధర్వ వేదం గురించి ఇంకొక విషయం కూడా చెబుతారు. మంత్రరాజంగా కీర్తించబడే గాయత్రిమంత్రం ఋక్, యజు, సామవేదాల సారమట. అధర్వవేదానికి వేరే మంత్రమున్నదట - అందువల్ల అధర్వవేదాన్ని అధ్యయనం చేసేముందు వేరొక ఉపనయనం చేసుకొని బ్రహ్మోపదేశం పొందటం ఆచారంగా వస్తుందంటారు.

వేదాలలో మూడు భాగాలుంటాయి. అవి సంహిత, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు
వేదాలలో సాధారణంగా చెప్పుకునే మంత్రభాగాలన్నీ “సంహిత”లోనికే వస్తాయి. ఈ మంత్రాలను, యజ్ఞంలో ఉపయోగించడానికి సూచనలను ఇచ్చేవి “బ్రాహ్మణాలు”. సంహితలోని మంత్రాలకూ, బ్రాహ్మణాలలోని కర్మలకు వెనుకగల అంతరార్థాన్నీ, సిద్ధాంతాన్నీ వివరించడమే ఆరణ్యకాల ఉద్దేశం. ఈ అరణ్యకాల చివరనే ఉపనిషత్తులుంటాయి.

సంహితని ఒక వృక్షంతో పోలిస్తే, బ్రాహ్మణాలు దాని పుష్పాలు, ఆరణ్యకాలు పక్వం చెందని కాయలు, ఉపనిషత్తులు పక్వం చెందిన ఫలాలు అని వర్ణిస్తారు ఆచార్యులవారు.

పరమాత్మకీ జీవాత్మకీ భేదం లేదన్న సత్యాన్ని జ్ఞానమార్గం ద్వారా తెలుసుకోవడం ఎలాగో ఉపనిషత్తులు వివరిస్తాయి
అలాగే కర్మకాండని విశ్లేషించిన తరువాత జైమినీ మహర్షి అది వేదతత్త్వానికి అంతిమ ఫలమన్నాడు. ఆ విశ్లేషణ శాస్త్రమును పూర్వ మీమాంస అంటారు. జ్ఞానకాండను విశ్లేషించిన వ్యాసుడు దానినే వేదాల సారమన్నాడు. అది ఉత్తరమీమాంస.
ఒక భావాన్ని సాధ్యమైనంత సంక్షిప్తంగా వ్యక్తీకరించగలదాన్ని సూత్రము అంటారు. ఈ నిర్వచనం ప్రకారం ఉపనిషత్తులు సూత్రాలు కావు. కానీ ఈ ఉపనిషత్తుల ప్రతిపాదనలన్నీ సూత్ర రూపంలో దొరికి పాఠమొకటుంది. అవే “బ్రహ్మసూత్రములు”. వీటిని రచించింది వేదవ్యాసుడు.
జీవుడంటే ఏమిటి?
జీవుడుండే జగత్తు అంటే ఏమిటి?
దీనికంతటికీ మూలమైన తత్త్వమేమిటి?
ఈ మూడు విషయాల గురించీ బ్రహ్మసూత్రములలో ఉంటుంది. ఈ బ్రహ్మసూత్రములు ఉత్తరమీమాంసలో భాగమే.

ఇక్కడ ఒకచోట ఆచార్యువారు ఒక చిత్రమైన విషయాన్ని చెబుతారు. కొన్ని పురాణాలను అనుసరించి, జ్ఞానులు కావాలి అనుకునేవారిని దేవతలు అనుగ్రహించరట. బృహదారణ్యక ఉపనిషత్తు కూడా “మనుష్యులు ఆత్మానుభూతిపొందడం దేవతలకు ఇష్టముండదు” అంటుందట. అందుకే వ్యాకరణంలో ఒక పదముంది. “దేవానాం ప్రియః” అని - అంటే దేవతలకు ప్రియమైన వాడని - అంటే మూర్ఖుడని అర్థం.

ఇక ఉపనిషత్తుల విషయానికి వస్తే… ఆదిశంకరులు పది ఉపనిషత్తులను ఎన్నుకొని వాటికి భాష్యం వ్రాశారు.
అందులో మొదటిదైన “ఈశావాస్య ఉపనిషత్తు”… ఈశ్వరుడు జగత్తంతా వ్యాపించి ఉన్నాడనీ, మనం చేసే పనులన్నింటినీ భగవంతునికి అర్పించి, పరమాత్మ తత్త్వాన్ని అనుభవసిద్ధం చేసుకోమని ఆరంభంలోనే చెబుతుంది.

అలానే… “నాకు ఆత్మజ్ఞానం కలిగింది అనేవానికి ఆ జ్ఞానం లేదు. ఆ స్థితిలో ఉండి వేరే ఎరుకలేని వానికే అది ఉంటుంది. దానిని చూచేవాడు నిజంగా చూడలేడు. చూడలేనివాడు చూడగలడు.” అంటుంది కేనోపనిషత్తు. “దొరకని దాని కోసం కేనలో అన్వేషించు” అని ఒక నానుడి కూడా ఉంది.

యమధర్మరాజుకీ, నచికేతుడనే బ్రహ్మచారికీ మరణానంతరం ఆత్మ ఏమవుతుందన్న విషయమైన సంవాదమే “కఠోపనిషత్తు”. “క్లేశం లేకుండా ఉండటం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమే స్వర్గమన్నా, మోక్షమన్నా” అంటుందీ ఉపనిషత్తు. “లేవండి, మేల్కొనండి” అని రామకృష్ణ మిషన్‌కు వివేకానందుడు ఇచ్చిన ఉద్భోద ఈ కఠోపనిషత్తునుండి తీసుకొనబడినదట.

“సృష్టి ఎలా జరిగింది?
దేవతలెవరు?
శరీరానికి జీవం ఎట్లా కలుగుతుంది?
జాగృత్ - స్వప్న -సుషుప్తుల స్వరూపమేమిటే?
ఓంకారాన్ని ఆరాధించడంవల్ల ప్రయోజనమేమిటి?
పురుషునకూ ఆత్మకూ గల సంబంధమేమిటి?”
ఈ ఆరు ప్రశ్నలకూ సమాధానాలు లభించే చోటు “ప్రశ్నోపనిషత్తు”

““ఆత్మ” అనే శరాన్ని “ఓంకార”మనే ధనుస్సు నుండి “బ్రహ్మ”మనే లక్ష్యాన్ని చేరేట్టు అప్రమత్తంగా ఆ శరమూ లక్ష్యమూ ఒకటే అయేట్టు విడవాలి” అని చెప్పేది “ముండక ఉపనిషత్తు”.
“సత్యమేవ జయతే” అన్న ప్రసిద్ధ వాక్యం కూడా ఈ ముండకోపనిషత్తులోనిదే.

తరువాతది “మాండూక్యోపనిషత్తు”. మండూకమంటే కప్ప. మెట్లని ఎక్కేటప్పుడు కప్ప ఒక్కొక్కమెట్టునే ఎక్కనక్కరలేదు. మొదటి మెట్టునుండి నాల్గవ మెట్టుకి గంతు వేయగలదు. మేల్కొని ఉండటం (జాగృత్), కలలు కనడం (స్వప్న), గాఢనిద్ర (సుషుప్తి) ఈ మూడు స్థితులను దాటి ఉన్న తురీయ స్థితికి చేరుకోవడానికి మార్గం చూపుతుందీ ఉపనిషత్తు. ఓంకారం జపించడం వల్ల నాల్గవ స్థితిని ఒక్కసారిగా చేరుకోవచ్చు అంటుంది.

మిగిలిన అన్ని ఉపనిషత్తులకంటే ఎక్కుగా అభ్యసింపబడే ఉపనిషత్తు “తైత్తిరీయ ఉపనిషత్తు”.
“సత్యం వద, ధర్మం చర” వంటి సూక్తులు ఈ ఉపనిషత్తులోనివే. “మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ” అని చెప్పే మంత్రాలు కూడా ఈ ఉపనిషత్తులోనివే. “బ్రహ్మానుభూతి పొందినవానికి ఏ భయమూ లేదు. ఆ స్థితిని అందుకోలేక మనస్సు, వాక్కు తిరోగమనం చేస్తాయి.” అంటుందీ ఉపనిషత్తు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల కోసం వివరిస్తుంది. ఆనందమయ కోశంలో ఆత్మ సహజంగా ఎలా ఆనందంగా ఉంటుందో ఇందులో వర్ణింపబడుతుంది.

జీవుడు తండ్రి నుండి తల్లి గర్భస్థమవడం, పాపపుణ్యాల ననుసరించి అనేక లోకాలలో జన్మలనెత్తడం, జనన మరణాల నుండి విముక్తి ఆత్మానుభూతి వల్లనే కలగటం- వీటి గురించి చెప్పే ఉపనిషత్తు “ఐతరేయ ఉపనిషత్తు”. ఒకరు జ్ఞానం ద్వారా ముక్తి పొందుతారన్న మాట సరికాదంటుంది. జ్ఞానమే బ్రహ్మ అని వివరిస్తుంది.

ఇక “చాందోగ్యోపనిషత్తు”లో… ఓంకారాన్ని ఉద్గీథగా పేర్కొని, ఆ ఓంకార ఉపాసన గురించి వివరాలనిస్తుంది. అక్షి విద్య, ఆకాశ విద్య, మధువిద్య, శాండిల్య విద్య, ప్రాణ విద్య, పంచాగ్ని విద్య వంటి విద్యలనెన్నిటినో ప్రస్తావిస్తుంది. ఈ విద్యలు పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి. అంతంలో దహర విద్య ఉంటుంది. పరమాకాశ స్వరూపమైన పరమాత్మను తన హృదయాకాశంలో దర్శించడమే, అనుభవించడమే దహరవిద్య. భగవద్గీతలో కఠోపనిషత్తుని బాగా వినియోగించినట్టే వ్యాసుని బ్రహ్మసూత్రాలకి చాందోగ్యోపనిషత్తులోని మంత్రాలు ప్రమాణాలంటారు.

అన్ని ఉపనిషత్తులలోకెల్లా పెద్దది “బృహదారణ్యకోపనిషత్తు”. ఆత్మని “నేతి నేతి” (ఇది కాదు, ఇది కాదు) అంటూ చెప్పేది ఈ బృహదారణ్యకోపనిషత్తులోనే. అంటే ఆత్మను ఏవిధంగానూ వర్ణింపలేమని అర్థం. మనం ప్రార్థనా శ్లోకంగా పాడుకునే “అసతోమా సద్గమయ” అనే శ్లోకం ఈ ఉపనిషత్తులోనిదే. అలాగే జనకుని విద్వత్ సభలోని చర్చలలో గర్గి వంటి స్త్రీలు పాల్గొన్నారనీ, స్త్రీలు కూడా బ్రహ్మవాదులై బ్రహ్మతత్త్వం గురించి చర్చింపగలిగేవారనీ ఈ ఉపనిషత్తు వల్ల తెలుస్తుంది.

అలాగే వేదాల ప్రధానోద్దేశ్యం కోసం చెబుతూ… వేదాల ఉద్దేశం మనిషి జీవన్ముక్తుడవటమే అంటారు. అంటే ఈ లోకంలో ఉండగానే మోక్షాన్ని పొందటం. పరమాత్మానుభూతి గురించి చెబుతూ… “దూరాత్ దూరే అంతికే చ” అంటుంది వేదం. అంటే అవగాహన కానంతసేపూ దూరంగా ఉంటుంది. అర్థమయితే దగ్గరే (లోపలే) ఉంటుందని అర్థం.

సామవేదానికి 1000, యజుర్వేదానికి 109 (శుక్ల యజుర్వేదానికి 15, కృష్ణ యజుర్వేదానికి 94), అధర్వ వేదానికి 50. ఋగ్వేదానికి 21 శాఖలుండేవట. మొత్తం కలిపి 1180. కానీ ఇప్పుడు మొత్తం కలిపి ఏడెనిమిది శాఖలకు మించి మనకు దొరకడం లేదట.
వేదవ్యాసుని అనంతరం కొన్ని వేల సంవత్సరాల వరకూ ఒక్కొక్కరూ మొదట ఒక వేద శాఖనీ, తరువాత ఇంకొక వేదశాఖనీ ఇలా అధ్యయనం చేసేవారు. ద్వివేది, త్రివేది, చతుర్వేది అన్న పేర్లు ఆ విధంగానే వచ్చాయి. అంటే క్రమంగా వీరు రెండు శాఖలను, మూడు శాఖలను, నాలుగు శాఖలనూ అధ్యయనం చేసిన వారని అర్థం.

ఇక వేదాంగాల విషయానికి వస్తే…
“శిక్షా”శాస్త్రం శబ్దాలను పలకడానికి సంబంధించిన నియమాలను ఇస్తుంది. ఇవి ఉచ్ఛారణ, స్వరం, మాత్ర, బలం, సామం, సంతానం(పదాలను సంధి చేయటం). వీటిని పాటించటం వల్ల శబ్దం శుద్ధంగా ఉంటుంది. అంతే కాదు, శరీరంలో ఏఏ భాగాల నుండి శబ్దోచ్ఛారణ ఉదయించాలి, ఎటువంటి ప్రయత్నం చెయ్యాలి అని కూడా చెబుతుందీ వేదాంగం.

తరువాతది “వ్యాకరణం”. ఇతర శాస్త్రాలకీ వ్యాకరణానికీ భేదముంది. ఇతర శాస్త్రాలలో సూత్రాలు భాష్యాల కంటే ప్రధానాలు. వ్యాకరణం విషయంలో అట్లా కాదు. సూత్రాలకంటే భాష్యమే ప్రధానం. వ్యాకరణభాష్యమొకదాన్నే మహాభాష్యమంటారు. ఈ మహాభాష్యాన్ని రచించినది పతంజలి మహర్షి. నటరాజ డమరుకం నుండి ఉద్భవించిన మాహేశ్వర సూత్రాలే వ్యారణానికి మూలం. అందుచేతనే శివాలయంలో వ్యాకరణ మండపాలుంటాయి.

మనం బట్టలు కుట్టించుకోవడానికి కొలతలు ఎంత అవసరమో, కవిత్వం సొబగులు దిద్దుకోవడానికి సరియైన కొలతలు అవసరం. పద్యానికి నిర్ణీతమైన నిడివీ, అక్షరాలూ ఉండాలి. అప్పుడే సరిగ్గా నప్పుతుంది. “ఛందస్సు” అనే వేదాంగం ఈ సూత్రాలను విధిస్తుంది. కవిత్వ రూపంలో ఉన్న వేదమంత్రాలని ఛందస్సంటారు. వేదంలో భాగం కాని వాటిని శ్లోకాలంటారు. పురాణాలలోనివీ, రామాయణంలోనివీ శ్లోకాలు అనుష్టుప్ ఛందస్సులోనే ఉన్నాయి. ఏ మంత్రమైనా రూపొందితే, దానిని నిర్దుష్టంగా సరియైన స్వరంతో పలికే విధానాన్ని శిక్ష శాస్త్రం నిర్దేశిస్తే, ఆ మంత్రం యొక్క రూపం సరిగ్గా ఉండటాన్ని ఛందస్సు నిర్దేశిస్తుంది.

“నిరుక్తం” వేదములకు నిఘంటువు. ఈ వేదాంగములో ప్రతిమాట యొక్క వ్యుత్పత్తీ, అర్థమూ వివరింపబడతాయి. ఇది వేదాలలో వాడబడిన అరుదైన, అసాధారణమైన పదాలకు అర్థాలు చెప్పడమే కాక, ఆ పదం అక్కడ ఎందుకు ప్రయోగింపబడిందో కూడా చెబుతుంది.

ఆ తరువాత వేదాంగం అయిన “జ్యోతిషం” మీద గర్గ, నారద, పరాశరాదులెందరో గొప్ప గ్రంథాలు వ్రాశారు. జ్యోతిషశాస్త్రం దూరంగా ఉన్న గ్రహాలను, నక్షత్రాలను వాటి పూర్వ గతులనూ, భవిష్య గతులనూ చూడడానికి ఉపయోగపడుతుంది. వైదిక కర్మలను నిర్వహించడానికి గ్రహాల స్థితిని తెలుసుకోక తప్పదు. గ్రహాల గతులను సూచించడానికి ఎన్నో లెక్కలు అవసరమవడం మూలంగా గణిత శాస్త్రం కూడా “జ్యోతిషం”లో భాగమయ్యింది.

విధేయతతో వేదాలను వల్లించాలి. “శిక్ష” ద్వారా వాటిలోని పదాలను నిర్దుష్టంగా నేర్చుకోవాలి. అందుకు “వ్యాకరణా”న్ని నేర్వాలి.. లయనూ, అర్థాన్నీ “ఛందస్సు”, “నిరుక్తం” ద్వారా గ్రహించాలి. కర్మను చెయ్యడానికి శుభముహూర్తాన్ని “జ్యోతిషం” వల్ల తెలుసుకోవాలి. ఇవన్నీ ఆఖరి వేదాంగమైన “కల్పం”లో చెప్పబడిన కర్మల నిర్వహణకొరకేనంటారు ఆచార్యులవారు.

ఏ కర్మను ఏ విధంగా చేయాలి? ఏ యే కర్మలను ఏ యే జాతులవారు చేయాలి? ఏ యే ఆశ్రమాలలో చేయాలి? ఏ కర్మకి ఏ మంత్రం, ఏ సామాగ్రి, ఏ అధిష్ఠాన దేవత? ఎందరు ఋత్విక్కులను నియమించాలి? ఏ యే ఆకారాలు గల ఏయే పాత్రలను వినియోగించాలి? - ఈ విషయాలనన్నింటినీ “కల్పం” చెబుతుంది.

వేదాలు, వేదాంగాలు తరువాతవి ఉపాంగములు.
అందులో మొదటిది “మీమాంస”. నిరుక్తంలో వేదమంత్రాల అర్థముంటుంది. ఆయా మంత్రాల ప్రాముఖ్యతా, ఉద్దేశమూ, వాటి విశిష్టతా నిర్దుష్టంగా గ్రహించే పద్ధతిని మీమాంస తెలుపుతుంది. పూర్వమీమాంస కర్మకాండలో చెప్పబడిన కర్మల, యజ్ఞాల ప్రాముఖ్యాన్ని విశదీకరిస్తుంది. ఉత్తరమీమాంస జ్ఞానకాండకు సంబంధించిన ఆత్మసాక్షాత్కారం గురించి చెబుతుంది. ఉత్తర మీమాంసనే వేదాంతమని అంటారు.

జైమిని రచించిన పూర్వమీమాంస బృహద్గ్రంథము. దానిలో వెయ్యి అధికరణాలున్నాయి. ఒక్కొక్క అధికరణం ఒక్కొక్క విషయాన్నే ప్రస్తావిస్తుంది. వెయ్యి అధికరణాలు వెయ్యి సమస్యలను తీసుకొని పైకి కనబడే అర్థంతో కాక వాటి పూర్వాపరాలను కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వస్తాయి. ఈ విశ్లేషణా పద్ధతిని మీమాంస అంటారు.

ఆరంభంలో వేదంలోని ఒక విషయాన్ని తీసుకుంటారు. ఆ తరువాత ఆ వాక్యార్థమిదేనని సమస్యని లేవనెత్తుతారు. ఆ తరువాత, ఆ అర్థానికి వ్యతిరేకంగా వాదిస్తారు. దీనిని పూర్వపక్షం అంటారు. ఆ తరువాత పూర్వపక్షంలో చెప్పిన దానిని ఖండిస్తారు. దీనిని ఉత్తరపక్షమంటారు. ఆఖరి దశలో పూర్వాపరాలను గ్రహించి ఒక నిశ్చయానికి వస్తారు. దీనిన నిర్ణయమంటారు. ప్రతి విషయము పైన నిర్ణయాన్నీ ప్రతీ అధికరణంలోనూ చెబుతారు. వేదవచనాలకి కేవలం ప్రతిపదార్థాలపై ఆధారపడి తప్పుడు భావాన్ని గ్రహించకుండా అసలైన తాత్పర్యాన్ని వివరించడమే వీటి ఉద్దేశం.
రెండవ ఉపాంగం… “న్యాయము”. దీనిని తర్కశాస్త్రమనికూడా అంటారు. తర్కం అంటే యుక్తుల ద్వారా ఈ సృష్టికర్త పరమేశ్వరుడే అని నిరూపించటమే. అదే ఈ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. వేదాలలో చెప్పబడిన వాటిని ధృవపరచడానికి వినియోగించే సాధనాలని న్యాయమంటారు. ఈ శాస్త్రకారుడు గౌతముడు. కణాదుడు కూడా న్యాయశాస్త్రం రచించాడు. దానిని వైశేషికమంటారు. మౌలిక సత్యాన్ని ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం అనే నాలుగు సాధనాల ద్వారా న్యాయశాస్త్రం చర్చిస్తుంది.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెబుతారు ఆచార్యులవారు.
కేవలం తమ దృక్పథాన్నే బలపరచుకోకుండా, భిన్నాభిప్రాయాలను ప్రకటించుకోవటాన్ని “వాదం” అంటారు. తాను ముందే నిశ్చయించుకున్న అభిప్రాయాన్నే సమర్థిస్తూ వాదించడాన్ని “జల్పం” అంటారు. మూడవ రకం కూడా ఉంది. జల్పంలో వలే ఒక నిశ్చితాభిప్రాయం కూడా వీరికి ఉండదు. అవతలివారు ఏది చెప్పినా ఖండిస్తూ ఉంటారు. దీనిని వితండవాదమంటారు.

తరువాత ఉపాంగం “పురాణములు”. ఒక భావాన్ని క్లుప్తంగా చెబితే అది మనస్సులో నాటుకోక పోవచ్చు. దానినే ఒక కథ గానో, ఉపాఖ్యానంగానో చెబితే మనస్సులో నిలచిపోతుంది. ఉదాహరణకు వేదం “సత్యం వద” అంటుంది. అంటే సత్యాన్ని పలుకు అని. అయితే, సత్యవ్రతాన్ని పాటించడం ఎంతటి మహనీయతకు దారితీస్తుందో పురాణాలలోని సత్యహరిశ్చంద్రుని కథలోని వృత్తాంతాల వల్ల తెలుస్తుంది. “ధర్మం చర” అంటే ధర్మాన్ని పాటించు అని వేదాలు చెబుతాయి. రెండు ముక్కల్లో వేదాలు చెప్పినదానిని మహాభారతంలోని పాండవుల కథ ద్వారా విశదంగా తెలుసుకోవచ్చు.

పురాణాలు కూడా చరిత్రే. చరిత్రని చదువ వలసిన కారణం అది పునరావృతమవడం. పరిస్థితులూ, సంఘటనలూ తిరిగి తిరిగి రావటం సహజం. అందు చేత గతం తెలిస్తే భవిష్యత్తుని తెలుసుకోగలం. గతం నుండి గుణపాఠాలను కూడా నేర్చుకోగలం. ఒక పరిస్థితిని ఉపేక్షిస్తే సంఘ విచ్ఛిత్తికో, యుద్ధానికో, నాగరికతా ధ్వంసానికో దారితీయగలదని చరిత్ర చెబుతోంది. అటువంటి పరిస్థితే మళ్ళీ పొడచూపితే మనం ముందు జాగ్రత్తలు తీసుకుని ఆ దుర్ఘటనలను తప్పించుకోవచ్చు అంటారు స్వామి.
వేదాలు ప్రభుసమ్మితాలు, పురాణాలు సుహృత్ సమ్మితాలు, కావ్యాలు కాంతా సమ్మితాలు అన్నది పెద్దల మాట. అంటే కావ్యం భార్యవలే, వేదం యజమాని వలే నడచుకుంటే, నడుమ పురాణాలు స్నేహితుని వలే వ్యవహరిస్తాయని అర్థం. మన మనస్సులలో ధర్మాన్ని ప్రతిష్ఠించటమే వాటి లక్ష్యం.

ఇక ఆఖరి ఉపాంగం “ధర్మశాస్రము”. మనందరికీ రామాయణభారతభాగవతాలు, కొన్ని పురాణ విషయాలు తెలిసే ఉంటాయి. ఆయాకాలాలలో స్థలాలలో వ్యక్తులు ఎటువంటి ధర్మనియమాలకు కట్టుబడ్డారో కూడా వీటివల్ల తెలుస్తుంది. కానీ ఈ నియమాలన్నీ ఒకచోట క్రోడీకరించి లేవు. పైగా ఆ పురాణ ఇతిహాసాలలో ఎక్కడా ఈ నియమాలను పాఠించే విధానమేదో చెప్పబడలేదు. అలాగే సత్కార్యాలను చేయడానికి మనకు వేరే నిర్దేశాలూ, సూచనలూ కావాలి. అవి లభ్యమయ్యేది ధర్మశాస్త్రంలోనే.

వేదాంగమైన “కల్పం” కర్మల పట్టికను సూత్రరూపంలో తయారు చేసింది. ఇవి ఎంతో క్లుప్తంగా ఉంటాయి. వివరాలతో కూడిన మార్గదర్శకాలు కావు. వీటికి పూర్తిగా వివరణలనిచ్చి, ఏ సందేహమూ మిగులకుండా చేసేవి ధర్మశాస్త్రములు. వీటినే స్మృతులు అంటారు. జీవుడు తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుండి పుట్టుక, పెంపు, వివాహం, ఆఖరికి దహనం వరకూ ఏమేమి చెయ్యాలో వివరంగా చెబుతాయి స్మృతులు. అంతే కాక నిద్దుర మేల్కొన్నప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ ఏయే పనులు చెయ్యాలో కూడా చెబుతాయి.

ఇవీ వేదములు, ఉపనిషత్తులు, వేదాంగములు, ఉపాంగముల గురించి జగదాచార్యులైన చంద్రశేఖరేంద్రసరస్వతీ మహాస్వాముల వారు చేసిన బోధనల సారాంశం. నిజానికి ఈ పుస్తకంలో ఏ పేజీని విస్మరించడానికీ అవకాశం లేదు. కానీ, అంతటినీ తిరిగి రాయడం సాధ్యంకాదు కనుక, ప్రధానమైన పద్నాలుగు విద్యలు ఏమిటి, అసలు అవేం చెబుతాయి అన్న విషయాల వరకే ఇక్కడ ప్రస్తావించాను. మా గదిలోని గోడపైన, నా హృదయపీఠం పైనా రోజూ నేను దర్శించి నమస్కరించుకునే పరమాచార్యుల వారి బోధల గురించి రాయడంలో కలిగిన పారవశ్యాన్ని ఇంకా అనుభవిస్తూనే... స్వస్తి!

- రాజన్ పి.టి.ఎస్.కె

www.facebook.com/photo.php?fbid=2641043579458048&s…-----------------------------------------------------------------------------------------


#RajanPTSK, #Vedamulu, #Paramacharya #Ajagava,

345 - 27